
కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానంతరం భక్తులు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
వేసవి సెలవులు మరియు ప్రత్యేక దినాల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరగడంతో.. లడ్డూ ప్రసాదాల విక్రయం ఈ ఏడాది జూన్ నెలలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటనలో వెల్లడించింది. భక్తుల అవసరాలకు అనుగుణంగా టీటీడీ పోటు (లడ్డూ తయారీ కేంద్రం) లో ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఎక్కడా ఎలాంటి కొరత లేకుండా నిరంతరాయంగా ప్రసాదాలను పంపిణీ చేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
2024 జూన్ నెలలో 1,02,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది.
శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుండి తరలివస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దానికి తగ్గట్టుగానే లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, ఇతర ముడిసరుకుల నాణ్యతను కాపాడుతూ, పంపిణీ కౌంటర్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ యాజమాన్యం, అధికారులు సమర్థవంతమైన ముందస్తు ప్రణాళికలతో సేవలందిస్తున్నారు.