Pushya Masam: నేటి నుంచి పుష్య మాసం ప్రారంభం.. శనికి ఈ నెల అంటే ఎందుకు ఇష్టం? ఈ నెలలో వచ్చే పూజలు, వ్రతాలు, పర్వదినాలు!

Pushya Masam: పుష్య మాసంలో శని దేవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. శివుడికి కార్తీక మాసం, విష్ణువుకు మార్గశిర మాసం ఎలా ఉంటాయో, అలాగే శని దేవుడికి పుష్యమాసం అంత ప్రీతికరమైనది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో సంచరించే నెలను పుష్య మాసం అని అంటారు. పుష్య మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు, వ్రతాలు జరుపుకుంటారు.

Published on: Dec 20, 2025, 12:00:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు నెలల్లో పుష్యమాసం పదవ మాసంగా పరిగణించబడుతుంది. పుష్యమాసంలో శని దేవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. శివుడికి కార్తీక మాసం, విష్ణువుకు మార్గశిర మాసం ఎలా ఉంటాయో, అలాగే శని దేవుడికి పుష్యమాసం అంత ప్రీతికరమైనది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో సంచరించే నెలను పుష్య మాసం అని అంటారు. పుష్య మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు, వ్రతాలు జరుపుకుంటారు. పైగా పుష్య మాసంలోనే సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మకర రాశికి అధిపతి శని కావడం వల్ల పుష్య మాసం అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం.

Pushya Masam: నేటి నుంచి పుష్య మాసం ప్రారంభం (pinterest)
Pushya Masam: నేటి నుంచి పుష్య మాసం ప్రారంభం (pinterest)

పుష్య మాసం 2025

ఈ ఏడాది పుష్య మాసం డిసెంబర్ 20, అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. జనవరి 18తో పుష్యమాసం ముగుస్తుంది. శని భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో శనీశ్వరుడిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి శుభ ఫలితాలు లేదా శిక్షలను ఇస్తాడు.

అమావాస్య నాడు శనికి తైలాభిషేకం చేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయి. శని పీడ నుంచి కూడా విముక్తిని పొందవచ్చు. అలాగే అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. పుష్య మాసంలో పెళ్లికాని అమ్మాయిలు కాత్యాయనీ వ్రతాన్ని చేస్తారు. పుష్య మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని, త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం.

పుష్య పౌర్ణమి

పుష్య మాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. స్నానం చేసి విష్ణువును ఆరాధిస్తే అనేక శుభ ఫలితాలను పొందవచ్చు.

అష్టమి

పుష్య మాసంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధిస్తారు. అలా చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు.

వైకుంఠ ఏకాదశి

పుష్య మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. పుత్ర సంతానం కలగాలని చాలా మంది ఈ రోజున వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. పుష్య మాసంలో గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, శంకుస్థాపనలు వంటివి చేయరు. అయితే సాధారణ పూజలు చేసుకోవడానికి ఎలాంటి నియమాలు లేవు.

పుష్య మాసంలో చేయవలసినవి

  1. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే, రాగి చెంబుతో ధాన్యం లేదా నెయ్యి దానం చేయడం మంచిది. ద్వాదశ ఆదిత్యుల రూపంలో సూర్యుడు ఈ నెలలో ఉంటాడు కాబట్టి, ప్రతిరోజూ ఏదైనా దేవతా స్తోత్రం లేదా ఆదిత్య హృదయం చదవాలి.
  2. పుష్యమాసంలో ఆదివారం నాడు నెయ్యి, ఉసిరికాయ తినకూడదు. వస్త్రదానం, తైలదానం, అన్నదానం చేస్తే శనిదోషాలు తొలగి ఆనందంగా ఉండవచ్చు.
  3. పుష్యమాసంలో హోమాలు చేసేటప్పుడు నువ్వులు సమర్పించాలి. నువ్వుల వంటకాలు తినడం శుభకరం. పితృదేవతలకు నువ్వులతో తర్పణాలు వదిలితే శుభ ఫలితాలు కలుగుతాయి.
  4. పుష్యమాసంలో పౌర్ణమి నాడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని పఠించాలి.

చొల్లంగి అమావాస్య

పుష్య మాసం ఆఖరి రోజున వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి నదికి ఏడుపాయల్లో ఒకటైన తుల్యభాగ, తూర్పు గోదావరి జిల్లాలోని చొల్లంగి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఆ రోజు అక్కడ స్నానం చేస్తే ఎంతో శుభం జరుగుతుందని నమ్మకం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More