...
...
Next Story

పుత్రదా ఏకాదశి 2026: ఏ రోజు వ్రతం చేయాలి? తేదీ, సమయంతో పాటు దీపదాన మహత్యం తెలుసుకోండి!

హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి సంతాన సౌభాగ్యాన్ని కోరుకునే దంపతులకు విశేషమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న ఆచరించాల్సి ఉండగా, ఆగస్టు 24న పారణ చేయాలని పేర్కొంటున్నారు.

Published on: Aug 19, 2026, 08:00:46 IST
Advertisement

హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందునా పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి ఆధ్యాత్మికంగా విశేషమైన స్థానం ఉంది. ఈ ఏకాదశి రోజున భోళా శంకరుడితో పాటు జగత్ప్రభువైన శ్రీమహావిష్ణువును ఏకకాలంలో పూజించే అరుదైన భాగం దక్కుతుంది. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి వేడుకలకు రంగం సిద్ధమైంది. భక్తులు ఈ పవిత్ర దినం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తేదీ, శుభ ముహూర్తాలు

పుత్రదా ఏకాదశి 2026: ఏ రోజు వ్రతం చేయాలి? ఎప్పుడు పారణ చేయాలి?
పుత్రదా ఏకాదశి 2026: ఏ రోజు వ్రతం చేయాలి? ఎప్పుడు పారణ చేయాలి?

ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న ప్రారంభమై, ఆగస్టు 24న తెల్లవారుజామున 4 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం ఆగస్టు 23వ తేదీనే ఏకాదశి వ్రతం ఆచరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పవిత్ర రోజున సిద్ధ యోగం, పూర్వాషాఢ నక్షత్రం యొక్క అద్భుతమైన కలయిక కుదురుతోంది. ఈ శుభ సంయోగం వల్ల పూజా ఫలం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. శ్రీహరికి ఏకాదశి తిథి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా చాతుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి.

ఎవరు ఆచరించాలి? వ్రత నియమాలు

సంవత్సరంలో రెండుసార్లు పుత్రదా ఏకాదశి వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో రాగా, మరొకటి పుష్య మాసంలో వస్తుంది. శ్రావణ మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. సంతాన సౌభాగ్యాన్ని కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. పుత్రదా ఏకాదశి కథ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సంతానం లేని ఓ రాజు రుషుల సలహా మేరకు ఈ వ్రతం ఆచరించి సంతాన సౌభాగ్యాన్ని పొందాడు.

ఈ పవిత్ర రోజున దీపదానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పవిత్ర నదులు, సరోవరాల దగ్గర లేదా తులసి చెట్టు కింద, రావి చెట్టు మొదట్లో దీపాలు వెలిగిస్తే విశేష ఫలితం దక్కుతుంది. దీప దానం కోసం గోధుమ పిండితో ప్రత్యేకంగా దీపం తయారు చేసి, అందులో ఆవు నెయ్యి పోసి దూది వత్తితో వెలిగించాలి. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే వ్రత సమాప్తి తర్వాత బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం శ్రేయస్కరం.

వ్రత విరమణ

ఏకాదశి వ్రతాన్ని ముగించే విధానాన్ని పారణ అంటారు. ద్వాదశి తిథి రోజున అంటే ఆగస్టు 24న ఏకాదశి వ్రత పారణ చేస్తారు. ఎప్పుడూ ద్వాదశి యుక్త ఏకాదశినే పరిగణలోకి తీసుకోవాలి తప్ప, దశమి యుక్త ఏకాదశి రోజున వ్రతం చేయకూడదని శాస్త్రం చెబుతోంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks