రథసప్తమి నాడు సూర్య భగవానుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. ప్రతి ఏటా రథసప్తమి మాఘ మాసం శుక్లపక్ష సప్తమి నాడు వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటాము. సూర్యుడు రథాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మార్చి, ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని, ఆ పర్వదినాన సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం, సంపద కలుగుతాయని నమ్మకం.
రథసప్తమి 2026

ఈ ఏడాది రథ సప్తమి జనవరి 25న వచ్చింది. ఆ రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు రావడం వలన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది, కోరికలు కూడా నెరవేరుతాయి.
రథసప్తమి విశిష్టత
హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ రోజు నుంచి ఈ దిశగా ప్రయాణం సాగుతుందని నమ్ముతారు.
సూర్య జయంతి
మాఘ సప్తమి నుంచి రాబోయే ఆరు నెలలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. ఏడు గుర్రాలను వేద ఛందస్సులుగా పిలుస్తారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. 12 రాశులను పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు; భూమిపైకి సూర్యుడు సాగించే ప్రయాణం మొదలవుతుందని ఆ రోజును సూర్య జయంతిగా జరుపుతారు.
రథసప్తమి నాడు ఏం చేయాలి?
- మాఘ సప్తమి నాడు ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడొచ్చు.
- రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి, తర్వాత రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.
- స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు మగవారు, ఏడు చిక్కుడు ఆకులు ఆడవారు పెట్టుకుని తలస్నానం చేయాలి.
- రథ సప్తమి నాడు ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవుపేడతో అలికి పద్మం వేసి, పొయ్యి పెట్టి ఆవుపాలు పొంగించాలి.
- పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం వేయాలి. ఇలా పరమాన్నాన్ని తయారు చేయాలి.
- తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు ఆకులతో రథం చేయాలి. ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకులపై పరమాన్నం పెట్టి నైవేద్యం సమర్పించాలి.
- ఇలా వీలుకాకపోతే గ్యాస్ స్టవ్ పైన అయినా నైవేద్యం వండి సమర్పించవచ్చు. ఇలా చిత్తశుద్ధితో సూర్యుని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది.