హిందువులు ఏకాదశిని పర్వదినంగా భావిస్తారు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుందని; విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు.

మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విజయాలను అందుకోవచ్చు. జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏడాది సఫల ఏకాదశి డిసెంబర్ 15న వచ్చింది. ఆ రోజు విష్ణువును ఆరాధించడంతో పాటు కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి.
సఫల ఏకాదశి 2025 ఎప్పుడు వచ్చింది?
ఏకాదశి తిథి డిసెంబర్ 14, 2025 ఆదివారం మధ్యాహ్నం 04:48 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 15, సోమవారం మధ్యాహ్నం 03:59 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం డిసెంబర్ 15న జరుపుకోవాలి. తరవాత రోజు ద్వాదశ తిథి నాడు ఉపవాసాన్ని విరమించాలి.
సఫల ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి:
- సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినకుండా చూసుకోండి. ఉపవాసం ఉండలేని వారు అన్నం తినకుండా ఏదైనా ప్రసాదం, పండ్లు, పాలు వంటివి తీసుకోవచ్చు. ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- సఫల ఏకాదశి నాడు వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. థామసిక ఆహారాన్ని తినకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజు కూడా తామసిక ఆహారం తినకుండా చూసుకోవాలి.
- ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకోకూడదు, తులసి ఆకులను కోయకూడదు, తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. తులసి దళాలను విష్ణువుకి ఏకాదశి నాడు సమర్పించాలి అనుకుంటే ఒక రోజు ముందుగానే వాటిని కోసి ఉంచుకోండి.
- ఏకాదశి నాడు అబద్దాలు చెప్పడం, గొడవలు పడడం, పెద్దవారిని బాధపెట్టడం వంటివి చేయకూడదు. అలా చేయడం వలన ఉపవాస ఫలితం పోతుంది.
- ఏకాదశి నాడు ఎవరిని అనవసరంగా అవమానించడం, తిట్టడం లాంటివి చేయకూడదు. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి; సానుకూల ఆలోచనలు కలిగేలా చూసుకోవాలి, ఆరాధించాలి. భగవన్నామస్మరణలో ఉండాలి.
- ఏకాదశి నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు. ఇలా ఈ పొరపాట్లు చేయకుండా విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే సఫల ఏకాదశి నాడు ఎంతో పుణ్యం కలుగుతుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. విజయాలను అందుకోవడానికి వీలవుతుంది.