నీతికి నిదర్శనం శనీశ్వరుడు: ఆయన పుట్టుక నుంచి చూపు వరకు దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు!
శని దేవుడి పేరు చెబితేనే చాలామంది భయపడతారు. కానీ ఆయన వెనుక ఉన్న పురాణ గాథలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. రావణాసురుడిని ముప్పతిప్పలు పెట్టడం నుంచి, తలుపులు లేని గ్రామం వరకు శని దేవుడికి సంబంధించిన అంతుచిక్కని మిస్టరీల సమాహారం మీకోసం.
శని కర్మఫల ప్రధాత. క్రమశిక్షణకు మారుపేరు శని దేవుడు. శని దేవుడి పుట్టుక నుంచి ఆయన చూపు దాకా ఎన్నో భయంకరమైన మిస్టరీలు ఉన్నాయి. చాలా మందికి వీటి గురించి తెలియదు. మరి ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శని దేవుడికి సంబంధించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇవి
1.సూర్యదేవుడితో శత్రుత్వం
శనికి తండ్రి సూర్యుడు అయినా, శనిదేవుడికి తండ్రితో ఏ మాత్రం పడేది కాదు. శని దేవుడు జన్మించినప్పుడు ఛాయా రంగులో ఉండడాన్ని చూసి సూర్యదేవుడు కుమారుడిగా అంగీకరించలేదు. నిరాకరించాడు. తల్లిని సూర్యుడు అవమానించాడని శని దేవుడికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ కోపంతోనే శివుడి కోసం తపస్సు చేసి గ్రహాల న్యాయాధికారి పదవిని శనిదేవుడు పొందాడు. అందుకే సూర్య, శని గ్రహాలు కలిసినట్లైతే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు.
2.శని దేవుడి వక్రదృష్టి వెనుక కారణం
శనిదేవుడి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వారికి కష్టాలు మొదలవుతాయని అందరికీ తెలిసినదే. అయితే ఆయన చూపు ఎందుకు అలా మారింది? అసలు శాపం ఎలా తగిలింది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శని దేవుడు విష్ణు భక్తుడు. శని భార్య ఓసారి సత్సంగం కోసం ఆయన దగ్గరకు వచ్చింది. శనిదేవుడు ధ్యానంలో ఉన్నాడు. ఆమెను గమనించలేదు. కోపంతో ఆమె, “ఇకపై నువ్వు ఎవరిని చూసినా కూడా వారు నాశనం అవుతారు” అని శపించింది. అందుకే శని ఎప్పుడూ కూడా తన తలను కిందకు దించుకుని ఉంటాడు.
3.రావణాసురుని తిప్పలు పెట్టిన శని
రావణుడు తన కుమారుడైన మేఘనాథుడు పుట్టే సమయంలో గ్రహాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని లాభస్థానంలో ఉండాలని అనుకున్నాడు. మేఘనాథుడు అమరుడు అవ్వాలని రావణాసురుడు కోరుకున్నాడు. అయితే శని దేవుడు చివరి నిమిషంలో తన కాలును 12వ స్థానంలో పెట్టాడు. దీంతో మేఘనాథుడి జాతకం ఒక్కసారిగా మారిపోయింది. కోపంతో రావణుడు శని దేవుని కాలు నరికాడు. అందుకే శనిదేవుడు నెమ్మదిగా నడుస్తాడని కథనం.
4.హనుమంతుడు ముందు శని ఓటమి
రావణుడు శనిదేవుడిని జైలులో పెట్టినప్పుడు, లంకా దహనం సమయంలో హనుమంతుడు శనిదేవుని విడిపించాడు. అందుకు కృతజ్ఞతగా “నీ భక్తులను నేను ఇబ్బంది పెట్టను” అని శని దేవుడు హనుమంతుడికి మాట ఇచ్చాడు. అందుకనే ఎలినాటి శని ప్రభావం ఉంటే హనుమాన్ చాలీసా పఠిస్తే మనిషి కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.
5.శని శింగణాపూర్.. తలుపులు లేని గ్రామం
మహారాష్ట్రలో శని శింగణాపూర్ అనేది ఒక పెద్ద మిస్టరీ. శనిదేవుడు స్వయంభూ శిలగా అక్కడ వెలిశాడు. ఈ గ్రామంలో ఏ ఇంటికీ కూడా తలుపులు, తాళాలు ఉండవు. దొంగతనం చేస్తే శనిదేవుడు వాళ్లను శిక్షిస్తాడని గ్రామస్తుల నమ్మకం. ఇప్పటికీ అక్కడ దొంగతనాలు జరగవు. ఎవరైనా ఒకవేళ దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే అంధులు అవుతారని లేదా పిచ్చివారు అయిపోతారని స్థానికులు అంటారు.
6.శివుడికి కూడా శని ప్రభావం
శనిదేవుడు శివుడి దగ్గరికి వెళ్లి, “రేపు మీ మీద నా ప్రభావం పడబోతోంది” అని చెప్తాడు. దాని నుంచి తప్పించుకోవడానికి శివుడు ఏనుగు రూపం ధరించి అడవిలో దాక్కుంటాడు. తర్వాత శని దేవుడు వచ్చి, “మీపై నా ప్రభావం పూర్తయిపోయింది” అని చెప్పగా, శివుడు నవ్వుతూ “నేను నీకు దొరకలేదు” అని అంటాడు. అప్పుడు శని దేవుడు, “దేవాది దేవుడైన మీరు అడవిలో ఏనుగులా తిరగాల్సి వచ్చింది. అది నా ప్రభావం కాదా?” అని అంటాడు. శని దేవుడి న్యాయానికి శివుడు కూడా ముగ్ధుడైపోయాడు.
అయితే శని దేవుడు కష్టాలు పెట్టే దేవుడు అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన కష్టాలు పెట్టే దేవుడు కాదు. మనలో అహంకారాన్ని తొలగించి, మనల్ని సరైన మార్గంలో పెట్టే గురువు శని దేవుడు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


