గంగా సప్తమి 2026: గంగపై ఆ మహర్షికి కోపం ఎందుకు.. త్రిపథగ, జాహ్నవి పేర్లు ఎలా? గంగానది భూమికి వచ్చిన అసలు కథ తెలుసుకోండి!
Ganga Saptami 2026: వైశాఖ శుద్ధ సప్తమి అంటే గంగా మాత భూమికి ప్రయాణమైన పవిత్ర రోజు. ఏప్రిల్ 23న వచ్చే ఈ 'గంగా సప్తమి' విశేషాలు, జహ్ను మహర్షి గంగను మింగేయడం వెనుక ఉన్న కథ, మరియు ఈ దేవనదికి గల వివిధ పేర్ల ప్రాముఖ్యతను ఈ కథనంలో తెలుసుకోండి.
Ganga Saptami 2026: భారతీయుల ఆరాధ్య దైవం, పాప ప్రక్షాళని గంగా మాత. హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసం శుక్ల పక్ష సప్తమి తిథి (ఈ ఏడాది ఏప్రిల్ 23) నాడు గంగాదేవి పరమశివుని జటల నుంచి భూమి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందుకే ఈ రోజును 'గంగా సప్తమి' లేదా 'గంగా జయంతి'గా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ తర్వాత జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు గంగమ్మ భూమిని పూర్తిగా తాకింది, ఆ రోజును మనం 'గంగా దశహరా'గా పిలుచుకుంటాం. గంగా సప్తమి నాడు గంగా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని కోట్లాది మంది భారతీయుల నమ్మకం.

జహ్ను మహర్షి ఆగ్రహం.. గంగమ్మకు ‘జాహ్నవి’ అనే పేరు ఎలా వచ్చింది?
పురాణాల ప్రకారం గంగాదేవి శివుడి జటల నుంచి భూమికి దిగివచ్చే సమయంలో ఆమె వేగం అత్యంత భయంకరంగా వుంది. ఆ ప్రవాహ వేగానికి భూమిపై ఉన్న సర్వస్వం అల్లకల్లోలమయ్యింది. ఈ క్రమంలో గంగమ్మ ప్రవాహం 'జహ్ను' మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తి, ఆయన తపస్సుకు భంగం కలిగించింది. దీనిపై ఆగ్రహించిన మహర్షి, గంగమ్మను శిక్షించాలనే ఉద్దేశంతో నది జలాన్నంతటినీ ఒక్క గుటకలో తాగేశారు.
దేవతలు, భగీరథుడు ఆందోళన చెంది, పితృదేవతల మోక్షం కోసం గంగను విడిచిపెట్టాలని జహ్ను మహర్షిని వేడుకున్నారు. వారి ప్రార్థనలను మన్నించిన మహర్షి, తన చెవి ద్వారా గంగను మళ్ళీ బయటకు వదిలారు. జహ్ను మహర్షి చెవి నుంచి తిరిగి జన్మించింది కాబట్టి, గంగా మాతను ఆయన కుమార్తెగా భావించి ‘జాహ్నవి’ అనే పేరుతో పిలవడం ప్రారంభించారు.
విష్ణువు పాదం నుంచి పుట్టిన గంగ: పురాణాల వివరణ
విష్ణు పురాణం ప్రకారం గంగమ్మ పుట్టుక అత్యంత విశిష్టమైనది. భగవంతుడైన విష్ణుమూర్తి ఎడమ కాలి బొటనవేలి గోరు నుంచి గంగ ఉద్భవించిందని చెబుతారు. మరికొన్ని పురాణాల ప్రకారం, శివుడి జటల నుంచి బయటకు వచ్చిన గంగమ్మ ఏడు ధారలుగా విడిపోయింది.
తూర్పు వైపుగా నలిని, హ్లాదిని, పావని అనే మూడు ధారలు ప్రవహించాయి.
పడమర వైపుగా సీత, సుచక్షు, సింధు అనే మూడు ధారలు వెళ్లాయి.
ఏడవ ధారే భగీరథి. భగీరథుని వెంట వెళ్ళిన ఈ ధారే నేడు మనం చూస్తున్న గంగానది.
కూర్మ పురాణం ప్రకారం గంగమ్మ మొదట సీత, అలకనంద, సుచక్షు, భద్ర అనే నాలుగు ధారలుగా ప్రవహించినట్లు పేర్కొన్నారు.
ముల్లోకాల్లోనూ ప్రవహించే ‘త్రిపథగ’
గంగానదిని ‘త్రిపథగ’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? పురాణాల ప్రకారం గంగ మూడు లోకాల్లోనూ ప్రవహిస్తోంది.
"స్వర్గంలో 'మందాకిని'గా, భూమిపై 'గంగ'గా, పాతాళంలో 'భోగవతి'గా ఈ దేవనది ప్రవహిస్తోంది. అందుకే ఆమెను త్రిపథగ (మూడు మార్గాల్లో ప్రయాణించేది) అని పిలుస్తాం," అని పండితులు వివరిస్తారు.
బ్రహ్మ దేవుని కమండలంలో గంగమ్మ నిక్షిప్తమై ఉండటం వెనుక కూడా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. విష్ణువు వామన అవతారంలో ఉన్నప్పుడు ఆయన పాదాలను బ్రహ్మ కడిగి, ఆ జలాన్ని తన కమండలంలో నింపుకున్నాడని ఒక కథ. అలాగే, శివుని గానానికి ముగ్ధుడైన విష్ణుమూర్తి శరీరం నుంచి స్వేదం (చెమట) రూపంలో గంగ ఉద్భవించిందని, దానిని బ్రహ్మ భద్రపరిచాడని మరో కథనం ప్రచారంలో ఉంది.
ఏది ఏమైనా, గంగా సప్తమి రోజున గంగా జలాన్ని తలపై చల్లుకున్నా లేదా గంగా మాతను స్మరించుకున్నా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


