కార్తీక మాసంలో గోపాష్టమి ఎందుకు జరుపుకుంటారు? గోమాత పూజ ప్రాముఖ్యత తెలుసుకోండి!

హిందూ సంప్రదాయంలో గోమాతకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కార్తీక మాసంలోని శుక్లపక్ష అష్టమి రోజున గోపాష్టమి పండుగను జరుపుకుంటారు. పురాణ కథనం ప్రకారం, శ్రీకృష్ణుడు తన ఆరేళ్ల వయసులో తొలిసారిగా దూడలను కాకుండా ఆవులను మేపే బాధ్యతను స్వీకరించిన రోజు ఇదే.  

Published on: Nov 17, 2026, 11:00:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ ధర్మంలో ఆవును గోమాతగా భావిస్తారు. సకల దేవతలు గోవులో కొలువై ఉన్నారని నమ్ముతారు. అందుకనే ఇలాంటి శుభకార్యాలు, వేడుకలు వంటివి జరిగినప్పుడు ఆవుకు కచ్చితంగా ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. ప్రతిఏటా కార్తీక మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు గోపాష్టమి జరుపుతారు. ఆ రోజు గోవులకు స్నానం చేయించి, అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది.

కార్తీక మాసంలో గోపాష్టమి ఎందుకు జరుపుకుంటారు? గోమాత పూజ ప్రాముఖ్యత తెలుసుకోండి! (AI)
కార్తీక మాసంలో గోపాష్టమి ఎందుకు జరుపుకుంటారు? గోమాత పూజ ప్రాముఖ్యత తెలుసుకోండి! (AI)

ఈ ఏడాది గోపాష్టమి నవంబర్ 17, అంటే ఈరోజు వచ్చింది. గోపాష్టమి వేడుకలు అసలు ఎలా ప్రారంభమయ్యాయి? ఈ పండుగకు కృష్ణుడి బాల్యంతో ప్రత్యేక సంబంధం ఉందట. పురాణాల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఆసక్తికరమైన కథ దీని వెనుక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

గోపాష్టమి పురాణ కథ

పురాణాల ప్రకారం చూస్తే, కృష్ణుడు సుమారు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ రోజు తన తల్లి యశోదమ్మతో ఇలా అన్నాడట. "అమ్మా! నేను పెద్దవాడిని అయ్యాను. దూడలను మేపడానికి వెళ్లను. ఆవులను మేపడానికి వెళ్తాను" అని తన మనసులోని కోరికను చెప్పగా, కృష్ణుడి మాటలు విన్న యశోదమ్మ, "నాయనా! ఈ విషయం మీ నాన్న నందబాబాతో మాట్లాడుకో" అని చెప్పింది.

అప్పుడు బాలగోపాలుడు నందబాబా దగ్గరకు వెళ్లి తన కోరికను చెప్పగా, ఇకపై దూడలను కాకుండా ఆవులను మేపడానికి వెళ్తానని పట్టుపట్టాడు. పెద్ద ఆవులను మేపడం కష్టమవుతుందని భావించిన నందబాబా ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరకు నందబాబా అతను చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.

ఆవులను మేపడానికి వెళ్లే ముందు పురోహితుడిని సంప్రదించి ముహూర్తం తెలుసుకోవాలని నందబాబా కృష్ణుడికి సూచించగా, సరేనని పురోహితుడి దగ్గరకు కృష్ణుడు వెళ్లాడు. నందబాబా ఆవులను మేపడం ప్రారంభించడానికి ముందు శుభముహూర్తం చూడమని పిలిచారని పురోహితుడితో చెప్పి, ఈరోజే ఆవులను మేపడానికి శుభముహూర్తం అని చెబితే పుష్కలంగా వెన్నను బహుమతిగా ఇస్తానని కృష్ణుడు చెప్తాడు.

కృష్ణుడి మాటలు విన్న పురోహితుడు నందబాబా దగ్గరకు వెళ్లి ఈరోజే శుభప్రదమైన రోజు అని చెప్తాడు. అంతేకాకుండా, ఆ తర్వాత ఏడాది వరకు ఆవులను మేపడం ప్రారంభించడానికి మరో శుభముహూర్తం లేదని చెప్తాడు.

కృష్ణుడు తొలిసారిగా ఆవులను మేపే బాధ్యత స్వీకరించిన రోజు కార్తీక అష్టమి. అందుకే ఈ పవిత్రమైన రోజును గోపాష్టమిగా చెప్తారు. అప్పటినుంచి గోపాష్టమి నాడు గోమాతను పూజించే సంప్రదాయం కూడా వచ్చింది. భక్తులందరూ ఆవులకు స్నానం చేయించి, పూలు, వస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. పచ్చగడ్డి, బెల్లం, ఇతర ఆహార పదార్థాలను గోవులకు తినిపిస్తారు.

గోమాతకు సేవ చేయడం వలన ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. శ్రీకృష్ణుని అనుగ్రహం కూడా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More