ఇంటికి ఏ తులసి మంచిది? రామ, శ్యామ తులసి మధ్య తేడాలు ఇవే!
రామ తులసి, శ్యామ తులసి రెండూ హిందూ సంప్రదాయంలో పవిత్రమైనవిగా భావిస్తారు. ఆకుల రంగు, సువాసన, ఆధ్యాత్మిక అనుబంధం వీటి మధ్య ప్రధాన తేడాలు. రామ తులసిని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదమనే వాస్తు నమ్మకం ఉంది.
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్ర స్థానం ఉంది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే, మార్కెట్లో లేదా నర్సరీలలో దొరికే తులసి మొక్కల్లో రకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ప్రధానంగా రామ తులసి, శ్యామ తులసి అని వీటిని పిలుస్తారు. రెండింటికీ దైవిక గుణాలు ఉన్నప్పటికీ, వాటి ఆకుల రంగు, సువాసన, ఆధ్యాత్మిక ప్రాధాన్యతలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి.

రామ, శ్యామ తులసి మధ్య ప్రధాన తేడాలు ఏమిటి?
ఈ రెండు మొక్కల రూపురేఖల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. రామ తులసి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, మృదువైన సువాసనను వెదజల్లుతాయి. ఈ మొక్కను మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవితో ముడిపెట్టి పూజిస్తారు.
మరోవైపు, శ్యామ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో, కొన్నిసార్లు ఊదా లేదా నలుపు రంగు ఛాయలతో కనిపిస్తాయి. దీని ఆకుల సువాసన రామ తులసితో పోలిస్తే చాలా ఘాటుగా ఉంటుంది. శ్యామ తులసిని శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా దీన్ని శక్తి, భద్రతకు ప్రతీకగా పరిగణిస్తారు.
ఇంట్లో రామ తులసిని ఎక్కడ నాటాలి?
శాంతి, సౌభాగ్యాలకు ప్రతీక అయిన రామ తులసిని ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. మహా విష్ణువు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మొక్కను పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, రామ తులసి మొక్కను ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఈ దిశలలో తులసి ఉండటం వల్ల సానుకూల శక్తి (Positive Energy) నిరంతరం ప్రవహిస్తుంది.
శ్యామ తులసి ప్రాధాన్యత, సరైన దిశ
శ్యామ తులసిని కృష్ణ తులసి అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకమైన రంగు, సువాసన దీనిని వేరుగా గుర్తింపజేస్తాయి. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల మానసిక ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. శ్యామా తులసిని ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో తగిన వెలుతురు తగిలే చోట ఏర్పాటు చేసుకోవచ్చు. రామ లేదా శ్యామ... ఏ తులసి మొక్కనైనా నిబంధనల ప్రకారం సరిగ్గా ఇంట్లో నాటితే మంచి ఫలితాలు కలుగుతాయి.
తులసి మొక్కను సంరక్షించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తులసి మొక్కను ఎంత శ్రద్ధగా పెంచుతామో, దాని చుట్టూ శుభ్రతను పాటించడం కూడా అంతే ముఖ్యం. మొక్క చుట్టూ ఎప్పుడూ చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి. సాయంత్రం వేళల్లో తులసి కోవెల దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణ చేయడం మన సంప్రదాయం. అయితే, ఆదివారం మరియు ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను అసలు కోయకూడదు. ఆకులు కోయాల్సి వస్తే శుచిగా ఉన్న చేతులతోనే తుంచాలి. ఎండిపోయిన ఆకులను చెత్తలో పడేయకుండా, కుండీ మట్టిలోనే వేయడం ఉత్తమమైన పద్ధతి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


