Telangana Caste Survey : ఇంకా 13 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు లేవు - సగానికి పైగా భూములు ఆ కులాలవే..! విస్తుపోయే నిజాలు!
Telangana caste survey : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన (SEEEPC) నివేదిక ద్వారా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 13.3 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు లేవని… 5.8 శాతం ఇళ్లు చీకట్లోనే మగ్గుతున్నాయని సర్వేలో వెల్లడైంది.
Telangana caste survey : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే (SEEEPC) 2024-25 నివేదిక బుధవారం బహిర్గతమైంది. రాష్ట్రంలోని 3.55 కోట్ల మంది ప్రజల స్థితిగతులను ప్రతిబింబించేలా ఈ నివేదికలోని అంశాలున్నాయి.

అభివృద్ధి చెందినట్లు కనిపిస్తున్న తెలంగాణలో ఇంకా కొన్ని వర్గాలు ప్రాథమిక సౌకర్యాలకు ఎంత దూరంలో ఉన్నాయో ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. ప్రధానంగా మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు వంటి కనీస అవసరాల విషయంలో సామాజిక వర్గాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది.
మరుగుదొడ్లు లేవు…
రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రాథమిక సూచికగా భావించే పారిశుధ్యం విషయంలో తెలంగాణ ఇంకా వెనుకబడే ఉంది. నివేదిక ప్రకారం… రాష్ట్రవ్యాప్తంగా 13.3 శాతం గృహాలకు ఇప్పటికీ మరుగుదొడ్డి సదుపాయం లేదు. ముఖ్యంగా మహిళలు, బాలికల ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన ఈ అంశంలో షెడ్యూల్డ్ తెగలు (ST) అత్యంత వెనుకబడి ఉన్నాయి.
- ST వర్గాలు: ఏకంగా 32.5 శాతం గృహాలకు మరుగుదొడ్లు లేవు.
- SC వర్గాలు: 18.8 శాతం ఇళ్లలో మరుగుదొడ్లు లేవు.
- BC వర్గాలు: 10.8 శాతం మందికి ఈ సదుపాయం లేదు.
- OC వర్గాలు: కేవలం 4.5 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్లు లేవని SEEEPC నివేదిక తెలిపింది.
గతంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణలోని వేల గ్రామాలకు 'ఓడిఎఫ్ ప్లస్' హోదా లభించినట్లు ప్రభుత్వ నివేదికలు చెప్పినప్పటికీ… తాజా క్షేత్రస్థాయి సర్వే ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
తాగునీటి సౌకర్యం విషయంలోనూ 21.2 శాతం గృహాలకు కుళాయి కనెక్షన్లు లేవని తేలింది. ఎస్సీల్లో 19.7 శాతం, ఎస్టీల్లో 21.0 శాతం, బీసీల్లో 20 శాతం ఇళ్లకు నల్లా నీరు అందడం లేదు. అగ్రవర్ణాల్లో ఈ శాతం కేవలం 12.8 గా ఉంది.
మరోవైపు…. 2024లోనూ సుమారు 6.56 లక్షల ఇళ్లు (5.8 శాతం) చీకట్లోనే మగ్గుతున్నాయి. ఆధునిక జీవన ప్రమాణాలకు అత్యవసరమైన విద్యుత్ సౌకర్యం ఎస్టీ ఇళ్లలో 11 శాతం, ఎస్సీ ఇళ్లలో 8.3 శాతం మేర అందుబాటులో లేదు. అదే ఓసీ వర్గాల్లో విద్యుత్ లేని ఇళ్లు కేవలం 2.7 శాతమే ఉండటం గమనించాల్సిన విషయం.
ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే కారు వంటి విలాసవంతమైన ఆస్తుల విషయంలోనూ వ్యత్యాసాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అగ్రవర్ణాల్లో కారు ఉన్న వారి సంఖ్య… బీసీలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉండగా.. ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా ఉంది.
ఈ సర్వే నివేదిక తెలంగాణ సమాజం యొక్క 'ఆరోగ్య పరిస్థితిని' ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు. 75 రకాల అంశాల ప్రాతిపదికన సేకరించిన ఈ సమాచారం, భవిష్యత్తులో సంక్షేమ పథకాల రూపకల్పనకు మరియు సామాజిక న్యాయం అందించడానికి కీలక భూమిక పోషించనుంది.
భూములు అత్యధికంగా వీళ్ల వద్దే…!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం భూముల్లో సగానికి పైగా (51.4 శాతం) కేవలం ఏడు కులాల వారి యాజమాన్యంలోనే ఉందని ఈ సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది. రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ సామాజికవర్గాల వారి జనాభా రాష్ట్ర మొత్తం జనాభాలో 32 శాతం కాగా వీరి వద్దే 51.4 శాతం భూమి ఉంది. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8 శాతం మాత్రమే ఉన్న ఓసీ రెడ్డి కులం…. మొత్తం భూముల్లో 13.5 శాతంతో తొలిస్థానంలో ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

