హైదరాబాద్‌ : ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్‌

Trainee IPS Uday Krishna Reddy Case : హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది.

Published on: Jul 29, 2026, 19:14:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trainee IPS Uday Krishna Reddy Case : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించి, ప్రాణాపాయ బెదిరింపులకు గురిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా…. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తీర్పు మేరకు పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

ఉదయ్ కృష్ణారెడ్డి (ఫైల్ ఫొటో)
ఉదయ్ కృష్ణారెడ్డి (ఫైల్ ఫొటో)

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా అసభ్యకరమైన, వేధింపులతో కూడిన సందేశాలు పంపుతూ ఉదయ్‌కృష్ణారెడ్డి తీవ్రంగా వేధించాడని బాధితురాలు తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. అకాడమీలో తోటి స్నేహితుల ముందే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసిక నరకానికి గురిచేశాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా…. మరొక ట్రైనీ అధికారితో తనకు అక్రమ సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశాడని, ఆ లేని సంబంధాన్ని అంగీకరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి నోటికొచ్చినట్లు దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

జూలై 9వ తేదీన అకాడమీలో తనను అడ్డుకున్న నిందితుడు… బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడని ఫిర్యాదులో వెల్లడించారు. గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించడమే కాకుండా…. మెడపై కత్తి ఉంచి భయాందోళనకు గురిచేసి గది నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడని తెలిపారు.

అనుమతి లేకుండా రహస్యంగా కొన్ని వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించినట్లు బాధితురాలు ఆరోపించారు. వాటి ఆధారంగా బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఆ వీడియోలను ఆమె భర్తకు కూడా పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జులై 18న కేసు నమోదు…

బాధిత మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా…. అత్తాపూర్ పోలీసులు జూలై 18న కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మంగళవారం రోజు ఉదయ్‌కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు, తగిన ఆధారాలు లభించడంతో బుధవారం అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

కేసు నమోదు కాగానే నిందితుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనపై వచ్చిన ఫిర్యాదు, ఆరోపణలు కేవలం పుకార్లని, అవన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. అయితే లోతుగా విచారణ జరిపిన పోలీసులు ఆధారాలతో సహా అతడిని కోర్టులో హాజరుపరచగా…. ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అలాంటి ఉదయ్ కృష్ణారెడ్డి… ఎంతో కష్టపడి ఐపీఎస్ సాధించారు. ఇలాంటి క్రమంలో… అతనిపై కేసు నమోదు కావటం, అరెస్ట్ కావటం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More