Sabarimala Helpline Number : శబరిమల వెళ్తున్నారా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

Sabarimala Helpline Number : శబరిమల వెళ్లే భక్తులకు కేరళం పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రకటించారు.

Published on: Nov 28, 2026, 14:10:09 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

2026-27లో శబరిమల మండలం-మకరవిళక్కు యాత్ర చేపట్టే యాత్రికులకు సహాయం చేయడానికి కేరళం పోలీసులు 24 గంటల హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. భక్తులు సహాయం కోసం 14432కు డయల్ చేయవచ్చు. అయితే కేరళం వెలుపల నుండి కాల్ చేసేవారు 04735-14432 నంబర్‌పై హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

శబరిమల అయ్యప్ప
శబరిమల అయ్యప్ప

ఈ హెల్ప్‌లైన్ తప్పిపోయిన వారిని గుర్తించడం, రోడ్డు ప్రమాదాలకు స్పందించడం, వాహనాలు పాడైపోతే వాటిని సరిచేయడం, నిలిచిపోయిన వాహనాలను నీలక్కల్‌కు తరలించడానికి రికవరీ వాహనాలను ఏర్పాటు చేయడంలో యాత్రికులకు సహాయం చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే శబరిమల వెళ్లినప్పుడు చాలా మంది భక్తులు పైన చెప్పిన సమస్యలు వస్తే ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. అదే హెల్ప్‌లైన్ నెంబర్‌కి కాల్ చేసి మీ సమస్య చెబితే బయపడవచ్చు.

అంతేకాదు హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా అత్యవసర వైద్య సహాయం, అంబులెన్స్ సేవలు, ఆసుపత్రి సపోర్ట్ కూడా అందిస్తుంది, ముఖ్యంగా నీలిమల ట్రెక్కింగ్ మార్గంలో గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులలో ఈ సహాయం ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు.

యాత్రికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను కనుగొనడంలో కూడా సహాయం పొందవచ్చు. అలాగే స్పాట్ బుకింగ్ లభ్యత, శబరిమల ఆలయం తెరిచే వేళలు, దర్శన సమయాలు, పూజా షెడ్యూల్‌ల గురించి సమాచారాన్ని కూడా హెల్ప్‌లైన్ ద్వారా పొందవచ్చు.

శబరిమలకు యాత్రికుల రాక పెరిగిన నేపథ్యంలో అధికారులు కొండపై ఉన్న సిబ్బందికి సీపీఆర్(CPR), ఇతర ప్రాణరక్షక పద్ధతులపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. దీనిద్వారా ఎమర్జెన్సీకి సంబందించి అలర్ట్‌గా ఉండాలని సిబ్బందికి తెలిపారు. పెరుగుతున్న యాత్రికుల రద్దీ నేపథ్యంలో శబరిమల అత్యవసర సన్నద్ధతను పెంచింది.

ట్రెక్కింగ్ మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు కుప్పకూలిపోయిన లేదా గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులకు గురైన యాత్రికులకు తక్షణ వైద్య సహాయం అందించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. కేరళం ఆరోగ్య శాఖ సన్నిధానం, పంబ వద్ద శిక్షణా తరగతులు, ప్రదర్శనలను నిర్వహించింది.

బాధితులను ఆసుపత్రులకు తరలించే ముందు వారికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR), కృత్రిమ శ్వాస అందించడంపై శిక్షణ ఇచ్చారు. గత మూడేళ్లుగా ప్రతి యాత్రా కాలంలో శబరిమలలో 230 నుండి 250 గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సజ్జిన్ కె రాజీ తెలిపారు.

గత సీజన్‌లో 65 మంది యాత్రికులు కుప్పకూలిన కేసులు నమోదు కాగా, ప్రస్తుతం జరుగుతున్న మండలం-మకరవిళక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుండి 14 ఇలాంటి ఘటనలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. కఠినమైన భూభాగం, రోగులను ఆసుపత్రులకు తరలించడానికి పట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, సకాలంలో జోక్యం చేసుకుని, ప్రాణరక్షణ అవకాశాలను మెరుగుపరచడానికి సన్నిధానంలో పనిచేస్తున్న సిబ్బందందరికీ సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ శిక్షణలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, పాము, జంతువుల కాటు, ఊపిరాడకపోవడం, మూర్ఛ వంటి వాటికి అత్యవసర ప్రతిస్పందన వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.

ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 76,085 మంది యాత్రికులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ భారీగా కనిపించిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. వీరిలో 52,208 మంది వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా, 10,546 మంది స్పాట్ బుకింగ్ ద్వారా, 8,207 మంది ఇతర తేదీలలో చేసుకున్న బుకింగ్‌ల ద్వారా వచ్చారు. రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలోనే 1,279 మంది భక్తులు ఆలయంలోకి ప్రవేశించారని తెలిపారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.