...
...
Next Story

Hyderabad : బాచుపల్లిలో విషాదం - సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు విషవాయువులు పీల్చి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

Published on: Nov 24, 2026, 18:20:09 IST
Advertisement

హైదరాబాద్ సిటీ శివారులోని బాచుపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక దుర్మరణం పాలయ్యారు. విషవాయువులు పీల్చడమే వీరి మృతికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పొట్టకూటి కోసం పనికి వచ్చిన కార్మికులు ఇలా విగతజీవులుగా మారడం స్థానికంగా కలకలం రేపింది.

ఒకరిని కాపాడబోయి మరొకరు….

బాచుపల్లిలో విషాదం Representative image (Pixel Image )
బాచుపల్లిలో విషాదం Representative image (Pixel Image )

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు బాచుపల్లిలోని సదరు అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే పనికి వచ్చారు. ముందుగా ఓ కార్మికుడు ట్యాంక్‌లోకి దిగాడు. లోపల విషవాయువుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఉక్కిరిబిక్కిరై, కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశాడు. అతని ఆర్తనాదాలు విన్న మరో ఇద్దరు సహచర కార్మికులు, అతనిని రక్షించేందుకు వెంటనే ట్యాంక్‌లోకి దిగారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ ముగ్గురూ లోపల పేరుకుపోయిన బురదలో (స్లడ్జ్) కూరుకుపోయారు. విషవాయువులు పీల్చడంతో ఊపిరాడక ముగ్గురూ ట్యాంక్‌లోనే ప్రాణాలు విడిచారు.

ట్యాంక్ నిర్మాణ లోపం కూడా ఈ ప్రమాద తీవ్రతను పెంచింది. "సెప్టిక్ ట్యాంక్‌కు కేవలం ఒకే ఒక మ్యాన్‌హోల్ ఉంది. లోపల చిక్కుకుపోయిన తర్వాత వారు బయటకు వచ్చేందుకు మరో మార్గం లేకపోయింది. బయట ఉన్న మరో సహచర కార్మికుడు పరిస్థితిని గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి పరుగున వచ్చారు" అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. స్థానికులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాచుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిర్లక్ష్యం ఎవరిదనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా కార్మికులను ట్యాంక్‌లోకి దింపారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks