హైదరాబాద్‌లో భారీ ఆపరేషన్ - 130 తయారీ కేంద్రాల్లో తనిఖీలు, 36 టన్నుల కల్తీ నెయ్యి సీజ్!
Hyderabad Adulterated Ghee Seized : హైదరాబాద్‌లో నకిలీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరాలపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. 36 టన్నుల కల్తీ నెయ్యి, ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు.
Hyderabad Adulterated Ghee Seized : భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ నెయ్యి తయారీ, విక్రయ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్వచ్ఛమైన దేశీ నెయ్యి పేరుతో మార్కెట్‌లో యథేచ్ఛగా సాగుతున్న భారీ కల్తీ దందాను అధికారులు బహిర్గతం చేశారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా సాగిన ఈ విస్తృత దాడుల్లో ఏకంగా 36 టన్నుల అపరిశుభ్ర, కల్తీ నెయ్యితో పాటు, దాని తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ప్రమాదకర రసాయనాలను సీజ్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు.

130 స్థావరాలపై దాడులు…
విశ్వసనీయ సమాచారం, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ‘హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్’ (H-FAST), ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 విక్రయ కేంద్రాలతో కలిపి మొత్తం 130 ప్రాంగణాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
తనిఖీల సమయంలో అధికారులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాసిరకం పదార్థాలు, శరీరానికి తీవ్ర హాని కలిగించే అనుమతి లేని రసాయనాలను క్రమబద్ధంగా కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో భాగంగా 36 టన్నుల కల్తీ నెయ్యి, మీగడ (ముడి సరుకు), పామాయిల్, వనస్పతి, కృత్రిమ నెయ్యి సువాసనలు తెచ్చే రసాయనాలు, స్టార్చ్, ఇతర కెమికల్ అడిటివ్స్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జప్తు చేశాయి. ఘటన స్థలంలోనే ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు ల్యాబ్ పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.
"కల్తీ మిశ్రమాన్ని '100% ప్యూర్ దేశీ నెయ్యి' అనే ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో సాధారణ ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది," అని సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
అసలైన నెయ్యి రుచి, సువాసన, రంగును కృత్రిమంగా రప్పించడానికి కొందరు తయారీదారులు పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, కెమికల్ ఫ్లేవర్లను వాడుతున్నారని సీపీ సజ్జనార్ వివరించారు. చివరికి కొన్ని ఉత్పత్తుల్లో అసలు పాలకు సంబంధించిన ఏ ఒక్క పదార్థం కూడా లేకపోవడం గమనార్హం.
బాధ్యతారాహిత్యంగా ప్యాకింగ్, విక్రయాలు….
ఈ కల్తీ ఉత్పత్తులను పారదర్శక కవర్లలో ప్యాక్ చేసి "100% స్వచ్ఛమైన నెయ్యి", "ప్రీమియం నెయ్యి", "ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి", "నేచురల్ నెయ్యి" అనే పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ డిసిపి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఈ ప్యాకెట్లపై కనీస నిబంధనలైన బ్యాచ్ నంబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ వివరాలు, తయారీ మరియు గడువు ముగిసే తేదీలు, క్వాలిటీ సర్టిఫికేట్ వంటివి ఏవీ ముద్రించలేదని ఆయన వెల్లడించారు.
కల్తీ శాతాన్ని బట్టి (10 శాతం నుంచి 40 శాతం వరకు) ఈ నకిలీ నెయ్యిని వేర్వేరు వ్యాపారాలకు మళ్లించేవారని దర్యాప్తులో తేలింది. తక్కువ కల్తీ ఉన్నదాన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తుండగా, తీవ్రంగా కల్తీ చేసిన నెయ్యిని పూజల కోసం వాడే నెయ్యిగా మార్కెట్‌లోకి వదిలారు. ఈ తయారీకి కావాల్సిన పాల మీగడను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తెప్పించుకునేవారని పోలీసులు తెలిపారు.
చవకైన ప్రత్యామ్నాయ పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో ఈ నకిలీ నెయ్యిని తయారు చేసి, మార్కెట్‌లో అసలైన నెయ్యి ధరలకు అమ్మి అక్రమార్కులు భారీగా లాభాలు గడించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కల్తీ నెయ్యిని కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోందని సీపీ సజ్జనార్ వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

