మియాపూర్‌లో 550 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానిదే : సుప్రీం కోర్టు కీలక తీర్పు
Supreme Court : మియాపూర్‌లో 550 ఎకరాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆ విలువైన భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
హైదరాబాద్ పరిధిలోని అత్యంత ఖరీదైన మియాపూర్ భూముల యాజమాన్య హక్కుల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న సుమారు 550 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కుల కోసం దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కీలక భూ పోరాటంలో ప్రైవేట్ వ్యక్తులు వేసిన అప్పీళ్లను కొట్టివేస్తూ, ప్రభుత్వానికి అనుకూలంగా సంచలన తీర్పును వెలువరించింది.

మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో విస్తరించి ఉన్న 550 ఎకరాలకు పైగా స్థలం తమదేనంటూ గతంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమణలకు యత్నించడంతో ఈ వివాదం మొదలైంది. పూర్వపు జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధ వారసులమని చెప్పుకుంటున్న అమీరున్నిషా, ఇతరుల నుంచి తాము ఈ భూములను చట్టబద్ధంగా పొందినట్లు పార్థసారధి, సువిశాల్ జైన్ అనే వ్యక్తులు దావా వేశారు.
తమ వద్ద ఇర్రెవొకేబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (Irrevocable GPA)తో పాటు సనద్ హక్కులు ఉన్నాయని, వాటికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని వారు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా రిజిస్టర్ అయిన పత్రాలను రద్దు చేసే అధికారం శేరిలింగంపల్లి మండల తహసీల్దార్‌కు లేదంటూ ప్రైవేట్ వ్యక్తులు వాదనలు వినిపించారు. కాగా ఈ వ్యవహారంలో గతంలోనే జెనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ రద్దు చేయడం, ఆ నిర్ణయాన్ని 2003లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమర్థించడం గమనార్హం.
ఉమ్మడి హైకోర్టు 2003లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనం ముందు బలమైన ఆధారాలను ఉంచారు. నిజాం కాలం నాటి జాగీర్దార్ కైసరుద్దీన్‌కు అప్పట్లోనే ప్రభుత్వం నుంచి తగిన పరిహారం చెల్లించడం పూర్తయిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిహారం చెల్లించిన తర్వాత ఆ భూములపై ఎలాంటి హక్కులు క్లెయిమ్ చేసే అవకాశం వారసులకు గానీ, వారి నుంచి భూములు కొన్నామని చెబుతున్న ప్రైవేట్ వ్యక్తులకు గానీ ఉండదని తేల్చిచెప్పారు.
ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను పూర్తిగా కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంటే కోర్టులు మౌనంగా చూస్తూ ఊరుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. వందల ఎకరాల విలువైన భూమిని ఆక్రమణల బారిన పడకుండా కాపాడేందుకు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని, న్యాయవాదుల బృందాన్ని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అభినందించింది.
ఐటి కారిడార్‌కు సమీపంలో ఉన్న ఈ 550 ఎకరాల స్థలం విలువ ప్రస్తుతం వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో ఈ వివాదానికి శాశ్వతంగా తెరపడింది. ఈ విజయం మూలంగా ప్రభుత్వ భూములకు పూర్తి రక్షణ లభించడమే కాకుండా, భూ ఆక్రమణదారులకు గట్టి హెచ్చరిక పంపినట్లయింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


