Telangana ACB : ఏసీబీ వలలో మైనింగ్ శాఖ ఏడీ జయరాజు - కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు!

భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లు, ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాదాపు రూ.3.06 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం… సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ఆస్తులు గుర్తించారు.

Published on: Aug 27, 2026, 21:38:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా మరొక భారీ అక్రమాస్తుల తిమింగలాన్ని పట్టుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటూ, ప్రస్తుతం వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తున్న బొజ్జా జయరాజుపై ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు విరుచుకుపడ్డారు. తన సర్వీసు కాలంలో అక్రమ మార్గాల్లో, అవినీతికి పాల్పడి రాబడికి మించిన ఆస్తులను కూడబెట్టారనే పక్కా సమాచారంతో అధికారులు కేసు నమోదు చేశారు.

ఏడీ జయరాజు
ఏడీ జయరాజు

2026 ఆగస్టు 27న జయరాజు, ఆయన బంధువులు, ముఖ్య అనుచరులకు చెందిన 8 వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 1988 అవినీతి నిరోధక చట్టం (2018 సవరణ) ప్రకారం ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

భారీగా ఆస్తులు…..

ఈ సోదాల్లో ఏసీబీ అధికారులకు కీలక పత్రాలు దొరికాయి. జయరాజు సంపాదించిన ఆస్తుల సర్కారు విలువ రూ.3,06,53,177 (మూడు కోట్ల ఆరు లక్షల యాభై మూడు వేల నూట డెబ్బై ఏడు రూపాయలు)గా తేలింది. అయితే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం… సుమారు రూ.100 కోట్లకుపైగా విలువ చేసే ఆస్తులుగా అంచనా వేస్తున్నారు.

  • హైదరాబాద్ బోడుప్పల్‌లో రూ.40 లక్షల విలువైన జి+2 (G+2) భవనం.
  • హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ప్లాట్.
  • కీసరలో రెండు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 ఓపెన్ ప్లాట్లు (విలువ రూ.15.77 లక్షలు).
  • 3.21 ఎకరాల వ్యవసాయ భూమి (విలువ రూ.8 లక్షలు).
  • రూ.10,03,640 నగదుతో పాటు ఎల్‌ఐసీ, మాక్స్ లైఫ్‌లలో రూ.19,86,104 పొదుపు సొమ్ము.
  • రూ.40 లక్షల విలువైన మూడు నాలుగు చక్రాల వాహనాలు (కార్లు), రెండు ద్విచక్ర వాహనాలు.
  • 629 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ రూ.37.23 లక్షలు), పోస్టాఫీసులో రూ.20.86 లక్షలు, మూడ బ్యాంక్ ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలు.
  • రూ.10.67 లక్షల విలువైన గృహోపకరణాలు.

విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. జయరాజు తన డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతాలను నిశితంగా పరిశీలించగా అక్రమ లావాదేవీల కోణం వెలుగులోకి వచ్చింది. ఇసుక రవాణాదారులు, వ్యాపారుల నుంచి లంచాల రూపంలో వసూలు చేసిన సుమారు రూ.24.80 లక్షల నగదును డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి జయరాజు కుమార్తె బ్యాంక్ ఖాతాకు మళ్లించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. లంచం సొమ్మునే ఈ విధంగా డిజిటల్ మార్గంలో బదిలీ చేశారని డ్రైవర్ కూడా అంగీకరించినట్లు అధికారులు చెప్పారు.ఈ అక్రమ లావాదేవీలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా గానీ, లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గానీ ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More