Telangana : పూజలతో డబ్బు రెట్టింపు చేస్తామంటూ టోకరా - ముఠా అరెస్ట్, రాష్ట్రవ్యాప్తంగా బాధితులు..!

క్షుద్రపూజలు, మంత్రాలతో డబ్బు రెట్టింపు చేస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ. 3.74 లక్షల నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Published on: Nov 23, 2026, 14:53:36 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

క్షుద్రపూజలు, మంత్రతంత్రాల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి, డబ్బు రెట్టింపు చేస్తామంటూ లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఓ అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠా గుట్టురట్టైంది. ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులను ఆత్రం పరుశురాం (40), మండలి బక్కన్న (47), నౌగాడే శేఖర్ (39), మండలి శైలేష్ (27), షేక్ అలీమ్ (36)గా పోలీసులు గుర్తించారు.

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - డబ్బులు సీజ్
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - డబ్బులు సీజ్

జల్సాలు, ఈఎంఐల కోసమే మోసాలు….

అమాయకుల ఆశను ఆసరాగా చేసుకుని ఈ ముఠా సభ్యులు బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసేవారు. ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిందితులు విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు, కార్ల ఈఎంఐలు కట్టుకోవడం, సొంత ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వంటివి చేసేవారని పోలీసుల విచారణలో తేలింది.

వారంలో రోజుల క్రితం తోకల రాజు అనే వ్యక్తి తన పరిచయస్తుడు శ్రీపతి శంకర్‌తో కలిసి పని నిమిత్తం ఆదిలాబాద్‌కు వచ్చారు. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద వీరిని కలిసిన నిందితులు, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని మాయమాటలు చెప్పి నమ్మించారు.

ఈ క్రమంలో నవంబర్ 19వ తేదీ సాయంత్రం ఇచ్చోడ మండల పరిధిలోని జాతీయ రహదారి-44 (NH-44) పక్కన ఉన్న టీజీడబ్ల్యూఆర్‌జేసీ (TGWRJC) పాఠశాల సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద వీరిని మోసం చేశారు.మరుసటి రోజు బాధితుడు తోకల రాజు ఇచ్చోడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జిల్లాలవ్యాప్తంగా కేసులు…

ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన ఆత్రం పరుశురాం గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి సహా పలు ఇతర జిల్లాల్లోనూ అమాయకులను నిలువునా ముంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ. 3,74,000 నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

"ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ముఠాపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇందులో ఉట్నూర్‌లో రెండు, ఇంద్రవెల్లిలో ఐదు, ఇచ్చోడలో ఒక కేసు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కేసుల్లో 10 మంది బాధితులను గుర్తించాము. అయితే రాష్ట్రవ్యాప్తంగా వీరు దాదాపు 24 మందిని మోసం చేసి ఉంటారని అనుమానిస్తున్నాము" అని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.