తెలంగాణ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారా? ప్రభుత్వం ఏం చెబుతోంది

తెలంగాణ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

Published on: Oct 8, 2026, 09:26:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలను ప్రైవేటీకరించే ఆలోచన గానీ, వాటిని లిస్టెడ్ కంపెనీలుగా మార్చే ఉద్దేశం గానీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని పునరుద్ఘాటించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్లకు (దాదాపు 20,000 MW) చేరుకున్నప్పటికీ, ఎక్కడా కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. క్లిష్టమైన సమయంలోనూ విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించిన విద్యుత్ సంస్థల అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

గత పదేళ్ల పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకుడు టి. హరీష్ రావు విద్యుత్ రంగంపై అబాండాలు వేస్తున్నారని భట్టి మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను విమర్శించే ముందు గత ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌కు కావలసిన బొగ్గు సరఫరా లింకేజీలను ముందుగా ఖరారు చేయకుండానే ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారని భట్టి ఆరోపించారు. సింగరేణి (SCCL), టీఎస్ జెన్‌కోల నడుమ కుదిరిన ఒప్పందం ప్రకారం యాదాద్రికి అవసరమైన 14 మిలియన్ టన్నుల బొగ్గులో సింగరేణి కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంది.

మిగిలిన 50 శాతం (7 మిలియన్ టన్నులు) విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి ఎంఎస్టీసీతో 2016 డిసెంబర్ 9న ఒప్పందం చేసుకున్నారు. రవాణా కోసం రైల్వే శాఖకు లేఖలు రాసినా ఆ ఒప్పందాలు అమలుకు నోచుకోలేదు. ఏప్రిల్ 27, 2022న మొత్తం 14 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణే సరఫరా చేయాలని మరో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో సింగరేణి జి-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 1.71 మిలియన్ టన్నులు మాత్రమే. అలాంటప్పుడు 14 మిలియన్ టన్నుల బొగ్గు ఎలా సరఫరా చేస్తారని విక్రమార్క ప్రశ్నించారు.

యాదాద్రి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 6.66గా ఉండటంతో ఈ భారాన్ని అంతిమంగా తెలంగాణ ప్రజలే మోయాల్సి వస్తుందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 25 ఏళ్ల జీవితకాలం ఉండే ఈ ప్లాంట్ వల్ల రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లను ప్రతీ వారం ప్రజల ముందు ఉంచుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More