శ్రావణపల్లి, కోయగూడెం బొగ్గు గనులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని బ్లాక్‌లపై సింగరేణి ఫోకస్

ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు బ్లాక్‌లను కూడా దక్కించుకునేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు చేస్తోంది. వేలంలో పాల్గొనేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

Published on: Oct 6, 2026, 14:43:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న 16వ విడత వాణిజ్య బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సమాయత్తమవుతోంది. తెలంగాణలోని శ్రావణపల్లి, కోయగూడెం బొగ్గు గనులను దక్కించుకోవడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేలానికి బిడ్లను సమర్పించడానికి అక్టోబర్ 16 చివరి తేదీ కాగా, డిసెంబర్ 3న ఈ ప్రక్రియ జరగనుంది.

సింగరేణి సంస్థ
సింగరేణి సంస్థ

తెలంగాణ, ఒడిశా సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లోని 25 బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం ఈ వేలంలో ఉంచింది. వీటిలో 21 బ్లాక్‌లు పూర్తిగా పరిశోధించినవికాగా, 4 పాక్షికంగా సర్వే చేసినవి. సింగరేణి భవిష్యత్తు, దీర్ఘకాలిక ఉత్పత్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బిడ్డింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం SCCL యాజమాన్యానికి తెలిపింది.

శ్రావణపల్లి గని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఉంది. కోయగూడెం OCP-3 గని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటికే సింగరేణి పరిధిలోని 14 బొగ్గు గనులు ఉత్పత్తి ముగిసి మూతపడ్డాయని తెలిపారు.

రాబోయే కొన్నేళ్లలో మరికొన్ని గనులు మూతపడే అవకాశముండటంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తి క్రమంగా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. అంచనాల ప్రకారం.. 2027-28 నాటికి మరో నాలుగు గనులు మూతపడితే, సింగరేణి వార్షిక ఉత్పత్తిలో ఏకంగా 12.51 మిలియన్ టన్నుల మేర కోత పడనుంది.

ఉత్పత్తి వేగాన్ని కాపాడుకోవడానికి, కార్మికుల ఉపాధిని రక్షించడానికి, విద్యుత్ కేంద్రాలకు నిరంతర బొగ్గు సరఫరా అందించడానికి, తెలంగాణ బొగ్గు గనుల ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా ఉండటానికి కొత్త గనులను దక్కించుకోవడం సింగరేణికి అత్యంత అవసరంగా మారింది.

ప్రస్తుతం తన ఆధీనంలో ఉన్న ఒడిశాలోని నైని బ్లాక్ పరిసరాల్లోని మరికొన్ని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడంపై కూడా సింగరేణి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో నువపాత్రపోరా, నువాగావ్ తెలిసాహి, అర్ఖపాల్ శ్రీరాంపూర్, మీనాక్షి సెంట్రల్ ఉన్నాయి.

ఈ గనులను కూడా పరిశీలిస్తున్నప్పటికీ, బిడ్డింగ్ పై సింగరేణి యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసేందుకు, ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకే సింగరేణి ఈ విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అలాగే మధ్యప్రదేశ్‌లోని బ్లాక్‌లపై కూడా ఫోకస్ చేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More