సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1,10,250 బోనస్

Singareni Bonus : సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగల శభవార్త అందించింది కేంద్రం. ఒక్కొక్కరికి రూ. 1,10,250 బోనస్ ఇవ్వనున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Updated on: Oct 5, 2026, 22:16:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) కార్మికులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,10,250 చొప్పున భారీ బోనస్ అందించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

సింగరేణి కార్మికులకు బోనస్
సింగరేణి కార్మికులకు బోనస్

అమావాస్య నీడల్లో, నేల గర్భంలో పగలు-రాత్రి తేడా లేకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశానికి వెలుగులు నింపుతున్న బొగ్గు గని కార్మికుల కృషి వెలకట్టలేనిదని కిషన్ రెడ్డి అభినందించారు. సింగరేణి అనేది కేవలం వ్యాపార దృక్పథంతో నడిచే బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతిలో భాగమైన కొంగు బంగారం అని కొనియాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందన్నారు.

సింగరేణి సంస్థను మరింత బలపేతం చేయడానికి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కేంద్ర మంత్రి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు అందవలసిన రూ. 60,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు.

భవిష్యత్ విద్యుత్ అవసరాలు, దేశ పరిశ్రమల ప్రగతిని దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలని యాజమాన్యానికి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో సింగరేణి బోర్డు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

'రానున్న దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్‌ ఇవ్వాలని నిర్ణయమైనది. దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి పరిశ్రమ మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి.' అని కిషన్ రెడ్డి అన్నారు.

బోనస్‌పై కొత్తగూడెం, మణుగురు, గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి తదితర సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కార్మిక సంఘాలు కూడా ఈ బోనస్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ, సింగరేణి సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ అభివృద్ధి సాధించడంలో శ్రమిస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందస్తుగా దసరా, నవరాత్రి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More