TG Electricity Bills : విద్యుత్ వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల షాక్ - పెరగనున్న నెలవారీ కరెంట్ బిల్లులు
తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు ఈఆర్‌సీ షాక్ ఇచ్చింది. రూ.5,420.23 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు డిస్కంలకు అనుమతినిచ్చింది. వచ్చే నెల బిల్లుల నుంచే ఈదనపు భారం పడనుంది.
తెలంగాణలో సామాన్య విద్యుత్ వినియోగదారులపై కరెంటు బిల్లుల భారం మోపేందుకు రంగా సిద్ధమైంది. రాష్ట్రంలోని నాన్-అగ్రికల్చర్ (వ్యవసాయేతర) వినియోగదారుల నుంచి ఏకంగా రూ.5,420.23 కోట్ల మేర ‘ట్రూ-అప్’ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలకు అనుమతినిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిర్ణయంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నెలవారీ కరెంటు బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

- 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు కోసం అదనంగా చేసిన ఖర్చుతో పాటు, 2023-24 నాటి రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు డిస్కంలు ఈ ప్రతిపాదనలు తెచ్చాయి.
- వినియోగదారుల నుంచి ట్రూ-అప్ రూపంలో మొత్తం రూ.7,635.22 కోట్లు వసూలు చేసుకునేలా అనుమతించాలని కోరుతూ 2025 నవంబరు 10న రెండు డిస్కంలు టీజీఈఆర్‌సీలో పిటిషన్లు దాఖలు చేశాయి.
- ఈ పిటిషన్లపై విస్తృత స్థాయి బహిరంగ విచారణ జరిపిన విద్యుత్ నియంత్రణ మండలి తుది ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ప్రతిపాదించిన మొత్తంలో వ్యవసాయ రంగానికి వర్తించే రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది.
- మిగిలిన రూ.5,420.23 కోట్లను మాత్రమే గృహ, వాణిజ్య, పారిశ్రామిక తదితర వ్యవసాయేతర కనెక్షన్ల వినియోగదారుల నుంచి రాబట్టాలని డిస్కంలను ఆదేశించింది.
ఎవరిపై ఎంత భారం…?
వచ్చే నెల నవంబరు నుంచి జారీ చేసే కరెంట్ బిల్లుల నుంచే ఈ ట్రూ-అప్ వసూళ్లను ప్రారంభించాలని డిస్కంలకు ఈఆర్‌సీ తేల్చిచెప్పింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి కనెక్షన్‌కు వినియోగించిన యూనిట్ల ఆధారంగా ఈ పెంపు లెక్కించనున్నారు.
- నవంబరు బిల్లులో వినియోగించిన ప్రతి యూనిట్‌కు 30 పైసల చొప్పున వసూలు చేస్తారు.
- డిసెంబరు నెల నుంచి ప్రతి యూనిట్‌కు 50 పైసల చొప్పున రాబడతారు.
- దక్షిణ డిస్కం (TGSPDCL): ఈ సంస్థ పరిధిలోని వినియోగదారులు రాబోయే 29 నెలల పాటు ఈ అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఉత్తర డిస్కం (TGNPDCL): ఈ సంస్థ పరిధిలోని వినియోగదారులు రాబోయే 26 నెలల పాటు ఈ భారాన్ని మోయక తప్పదు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ విధానం అమల్లో ఉన్నందున వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులపై నేరుగా ఎలాంటి ట్రూ-అప్ ఛార్జీలు విధించరు. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని ఈఆర్‌సీ పేర్కొంది.
కరెంట్ బిల్లుల విషయంలో వినియోగదారులకు స్పష్టత ఉండాలని ఈఆర్‌సీ ఆదేశించింది. ప్రతి నెలా జారీ చేసే బిల్లులో ట్రూ-అప్ ఛార్జీని ప్రత్యేకంగా చూపించాలి. అది ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది, ఆ నెలలో వాడిన కరెంటు ఎంత, వర్తింపజేసిన యూనిట్ రేటు ఎంత అనే వివరాలను విడివిడిగా పేర్కొనాలి. సాధారణ ఛార్జీలతో ఈ ట్రూ-అప్‌ను ఏమాత్రం కలపకూడదని నిబంధన విధించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

