రైతు డిస్కంతో వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం కరెంట్ మీటర్లు పెడుతుందా?

తెలంగాణలో రైతు డిస్కంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు పెట్టడంపై ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం అంటోంది?

Published on: May 30, 2026, 11:15:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు(రైతులకు) ఎలాంటి మీటర్లు అమర్చే ప్రసక్తే లేదని తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (TGRPDCL) సీఎండీ మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ స్పష్టం చేశారు. కొత్త డిస్కాం ఏర్పాటు ఉద్దేశం రైతులకు మెరుగైన సేవలు, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమేనని ఆయన ఉద్ఘాటించారు.

రైతు డిస్కం
రైతు డిస్కం

కొత్త డిస్కాంకు పంపిణీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ 'టీజీఆర్పీడీసీఎల్' దాఖలు చేసిన దరఖాస్తుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ సంస్కరణలు, కొత్త డిస్కాం ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన వివరంగా మాట్లాడారు.

ప్రత్యేక డిస్కాం ఏర్పాటు అనేది ఏకపక్షంగా లేదా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదని సీఎండీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూలై 30, 2025న కొత్త డిస్కాం ఏర్పాటును ప్రకటించగా, డిసెంబర్ 2025లో రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. తెలంగాణ డిస్కాంల ఆర్థిక పారామితులు ఏటా క్షీణిస్తున్నాయని, ప్రతిపాదిత కొత్త డిస్కాం పరిధిలో 2024-25 నాటికి పేరుకుపోయిన నష్టాలు ఏకంగా రూ.69,741 కోట్లకు చేరాయని మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ ఆందోళన వ్యక్తం చేశారు.

'రాష్ట్రంలో సరఫరా అవుతున్న ప్రతి 100 యూనిట్ల విద్యుత్‌లో 80 యూనిట్లకు మాత్రమే లెక్కలు ఉంటున్నాయి లేదా ఆదాయం వస్తోంది. మిగిలిన 20 యూనిట్లకు ఎలాంటి లెక్కలు, ఆదాయం లేదు. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ డిస్కాంల రేటింగ్స్ చివరి స్థానంలో ఉన్నాయి.' అని ముషారఫ్ పేర్కొన్నారు. ఎన్‌పీడీసీఎల్ చివరి స్థానంలో, ఎస్పీడీసీఎల్ కింద నుంచి మూడో స్థానంలో ఉన్నాయని, దేశ సగటు ఏటీ అండ్ సీ నష్టాలు 15 శాతం ఉంటే.. తెలంగాణలో అది 20 శాతంగా ఉందని వివరించారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు విద్యుత్తే వెన్నెముక

మూడో డిస్కాం ఏర్పాటుపై వస్తున్న విమర్శలకు సీఎండీ సమాధానమిస్తూ.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విద్యుత్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉందన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.5 శాతం కాగా, అందులో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారని, కొత్తగా వస్తున్న పరిశ్రమలకు కూడా భారీగా విద్యుత్ అవసరమని చెప్పారు. అలాగే దేశంలోనే అగ్రగామి వరి ఉత్పాదక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో 47 శాతం మంది జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు.

వ్యవసాయ విద్యుత్ దుర్వినియోగంపై నిఘా

రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో మూడో వంతు వ్యవసాయ రంగానికే పోతుందని ముషారఫ్ తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో 30 లక్షల మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, ఉచిత విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.

అయితే రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ఇతర అవసరాలకు మళ్లుతున్నట్లు (డైవర్షన్) అనుమానాలు ఉన్నాయని సీఎండీ పేర్కొన్నారు. ఏటా వ్యవసాయం పేరిట 25,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోందని, ఇదంతా రైతులకే అందుతుందా లేదా ఇతర అవసరాలకు పక్కదారి పడుతుందా అనే కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ వరకే లెక్కలు!

రాష్ట్రంలో ఏటా విద్యుత్ షాక్‌ల వల్ల సుమారు 600 మంది మరణిస్తున్నారని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడానికి కొత్త డిస్కాం పనిచేస్తుందని సీఎండీ హామీ ఇచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్ల త్వరితగతిన మార్పిడి, స్థిరమైన వోల్టేజ్ సరఫరా, కొత్త కనెక్షన్ల తక్షణ మంజూరు వంటివి కొత్త డిస్కాం లక్ష్యాలన్నారు.

రైతులకు మీటర్ల విషయమై మళ్లీ స్పష్టతనిస్తూ.. 'కేవలం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ స్థాయి వరకే విద్యుత్ లెక్కింపు జరుగుతుంది. అంతకు మించి రైతు వ్యక్తిగత కనెక్షన్‌కు ఎలాంటి మీటర్లు పెట్టం.' అని స్పష్టం చేశారు. తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు కూడా రైతుల కోసం ప్రత్యేక డిస్కాంలను ప్రకటించాయని గుర్తుచేశారు.

కొత్త డిస్కాం పరిధిలోకి వచ్చే సేవలు

ప్రస్తుతం ఉన్న రెండు డిస్కాంల నుంచి కింది సేవలను కొత్త డిస్కాం పరిధిలోకి పునర్వ్యవస్థీకరించనున్నారు:

  • వ్యవసాయ వినియోగదారులు
  • ఎత్తిపోతల పథకాలు
  • మిషన్ భగీరథ
  • హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై
  • మునిసిపల్ తాగునీటి కనెక్షన్లు

ఈ కొత్త డిస్కం ఏర్పాటు కోసం ప్రస్తుతం ఉన్న సంస్థల నుంచి దాదాపు 2,000 మంది ఉద్యోగులను బదిలీ చేయనున్నట్లు తెలిపారు సీఎండీ. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విభజన పూర్తి కాగానే ఈఆర్సీ ముందు ఏఆర్ఆర్‌లను దాఖలు చేస్తామన్నారు. కాగా కొత్త డిస్కాం ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అరుణ్, ట్రాన్స్‌కో అధికారులు ఈఆర్సీకి తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఈఆర్సీకి మొత్తం 34 అభ్యంతరాలు/సలహాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More