దేవాదాయ శాఖలో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయా? నిజమేనా?
కొన్ని రోజులుగా తెలంగాణ దేవాదాయ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్ అంటూ ప్రచారం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు వైరల్ అయ్యాయి. దీనిపై దేవాదాయ శాఖ స్పందించింది.
తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఈ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూశారు. ఈ 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న నకిలీ నియామక ప్రకటన పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ హెచ్చరించింది.

దేవాదాయ శాఖ అటువంటి నియామక ప్రకటనను ఏదీ విడుదల చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు ఆ తప్పుడు ప్రకటనను నమ్మవద్దని, దానికి స్పందించవద్దని సూచించారు. అన్ని నియామక ప్రకటనలు కేవలం అధికారిక ప్రభుత్వ, శాఖాపరమైన వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే ఉంటాయి. ఈ నకిలీ ప్రకటనను సృష్టించి, వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ పేర్కొంది.
ఏమని ఫేక్ న్యూస్ వైరల్ అయింది?
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో అధికారులు నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేశారని న్యూస్ వైరల్ అయింది.
మొత్తం 190 ఖాళీల భర్తీ కోసం ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా కింది పోస్టులు ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గ్రేడ్-I, గ్రేడ్-II, గ్రేడ్-III కేటగిరీల్లో ఆలయాల నిర్వహణను చూసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారని ప్రచారం చేశారు. జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమిషనర్లకు సంబంధించిన పోస్టులు ఇందులో ఉన్నాయని చెప్పారు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుందని వార్తను వైరల్ చేశారు.
అంతేకాదు.. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ - కేవలం EO పోస్టులకు) పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి ఇంటర్వ్యూలు ఉండవని తప్పుడు వార్తను ప్రచారం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన దేవాదాయ శాఖ ఎలాంటి పోస్టుల భర్తీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


