Bonalu Panduga : బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజాలో ఆధ్యాత్మిక శోభ
Bonalu Panduga : హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. భాగ్యనగరం బోనమెత్తింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంతోపాటుగా నగరంలోని అనేక ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నడుస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తడంతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో వికసిస్తోంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, జోగినుల నృత్యాలతో పాతబస్తీ వీధులన్నీ కోలాహలంగా మారాయి.

ఉదయం 4:30 గంటలకే ఆలయ తలుపులు తెరిచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి 10:30 గంటల వరకు భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించేందుకు అనుమతి ఉంటుంది. సాయంత్రం వేళ అమ్మవారి శాంతి కళ్యాణం మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.
బోనాల జాతర సందర్భంగా పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలయాన్ని దర్శించుకుని బంగారు బోనాన్ని నివేదించారు.
అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ యాదవ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టాలీవుడ్ కథానాయకులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రముఖ గాయని మంగ్లీ తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
లాల్ దర్వాజా పరిసరాల్లో దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ దర్శనం, బోనాలు మోసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 6 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
ఉచిత తాగునీటి కేంద్రాలు, ప్రాథమిక వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపులు, అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా 100 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం జరగనుంది. దీనితో పాటు పోతురాజుల విన్యాసాలు, ఏనుగుపై అమ్మవారి భవాని రథయాత్ర గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. లాల్ దర్వాజాతో పాటు పరిసరాల్లోని దాదాపు అనేక దేవాలయాల్లో కూడా ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


