రేపు తెలంగాణ బంద్ - అన్ని పార్టీల మద్దతు..! డీజీపీ కీలక ఆదేశాలు
బీసీ రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా రేపు(అక్టోబర్ 18) రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సహా ప్రజా, విద్యార్థి సంఘాలు కూడా మద్దతునిచ్చాయి.
రాష్ట్రంలో గత కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ల చుట్టు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఏమైనా మెరిట్స్ ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సూచించింది. ఫలితంగా రిజర్వేషన్ల పెంపు అంశం మరింత సంక్లిష్టంగా మారినట్లు అయింది.
తాజా పరిణామాలపై బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హై కోర్టు స్టే ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ ను పక్కన పెట్టడంతో బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్ కు పిలుపినిచ్చింది. అందరూ కలసి బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది.
అన్ని పార్టీల మద్దతు..!
ఈ బంద్ కు బీసీ సంఘాల జేఏసీ అన్ని పార్టీల మద్దతు కోరింది. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు మద్దతు ప్రకటించాయి. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు.
ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి సహకరించాలని బీసీ సంఘాల జేఏసీ నేతలు కోరారు. సంపూర్ణంగా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంలో బీజేపీపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని... పార్లమెంట్ లో పోరాడేందుకు కాంగ్రెస్ పై కూడా పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు
రేపటి బంద్ తో రాష్ట్రంలోని బడులు, కాలేజీలు తెరిచి ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే బంద్ కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వటమే కాకుండా ఎమ్మార్పీఎస్ తో పాటు అనేక ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించే యోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కూడా సెలవులు ఉండున్నాయి.
శాంతియుతంగా బంద్ జరుపుకోండి - డీజీపీ
రేపటి బంద్‌పై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. బంద్ పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని… బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

