కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంపై దాడికి రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని బీఆర్ఎస్ ఆరోపణ.. రచ్చ రచ్చ!

కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంపై దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు కుట్ర పన్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు, కార్యకర్తలపై కుట్ర, బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Published on: Sep 8, 2026, 18:10:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవెల్లి నివాసంపై పోలీసుల సహకారంతో దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ శాసనసభ్యుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రవెల్లికి చేరుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎర్రవెల్లికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

కాలినడకన వెళ్తున్న కేటీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు
కాలినడకన వెళ్తున్న కేటీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు

దీంతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ క్రమంలో హైడ్రామా నెలకొంది. ఈ ప్రణాళికలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శాసనసభ్యులు, పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారనే సమాచారంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించాయి. అయితే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని తీవ్రంగా నిలదీసి, అక్కడి నుండి తరిమికొట్టడంతో వాతావరణం కాసేపు రణరంగాన్ని తలపించింది.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎంతమందిని అరెస్టూ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు భయపడేది లేదని, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడతాయని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి దళితులపై నిజంగా ప్రేమ ఉంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన దళిత, గిరిజన డిక్లరేషన్ హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్‌పై కుట్రలు చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయంలో తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

పార్టీ కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవద్దని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అంతకుముందు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి కేసీఆర్ నివాసానికి చేరేలా చేసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడికి కుట్ర పన్నుతున్నారని, గూండాలను, రౌడీలను పంపుతున్నారని ఆరోపించారు.

భూ భారతి చట్టం కింద ప్రభుత్వ భూములను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల వంటి సమస్యలను లేవనెత్తకుండా ఆపేందుకు, బీఆర్ఎస్ శాసనసభ్యులను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను రక్షించడానికి ఎర్రవెల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని కూడా ఆయన ఆరోపించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More