కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే.. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా!
కేసీఆర్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నాలో భారీగా పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ గళమెత్తింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటుగా పలువురు కీలక నేతలు పాల్గొని, కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. 'ఏదైనా సంస్థలో పనిచేసే సాధారణ ఉద్యోగి వరుసగా వారం రోజులు ఆఫీస్‌కు రాకపోతే జీతం కోత విధిస్తారు. మరి ప్రజల ద్వారా ఎన్నికై, ప్రజాప్రతినిధిగా ఉంటూ శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా ముఖం చాటేస్తున్న కేసీఆర్‌కు ప్రభుత్వ జీతభత్యాలు ఎందుకు చెల్లించాలి?' అని ఆయన ప్రశ్నించారు.
సభకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా సరైన సూచనలు ఇవ్వడం బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడి విధి అని వీహెచ్ గుర్తుచేశారు. ఆ బాధ్యతను నిర్వర్తించలేనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగే హక్కు ఆయనకు లేదని, వెంటనే రాజీనామా చేయాలని వీహెచ్ స్పష్టం చేశారు.
ధర్నా ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు బ్యానర్లు, నినాదాలతో ప్లకార్డులు పట్టుకున్నారు. కేసీఆర్ ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, అధికారిక నివాసం, జీతభత్యాల పేరిట ఇప్పటివరకు సుమారు రూ. 21 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ప్రజాధనాన్ని వినియోగించుకుంటూ సభకు, ప్రజలకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్య విరుద్ధమని నాయకులు విమర్శించారు.
ఈ వేదికగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన విజయాన్ని వివరించడమే కాకుండా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్న తరుణంలో దానికి సరిగ్గా ఒకరోజు ముందే కాంగ్రెస్ ఈ స్థాయి నిరసనను చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్గాలు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నాయి. కేసీఆర్ తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతారని, అయితే అది మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే జరుగుతుందని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


