ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు కేసీఆర్...! రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల ప్రకారం ఆదివారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ… రేపు శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలపాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఓసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్… మరోసారి కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఎర్రవెల్లిలో కాకుండా నందినగర్ నివాసంలోనే విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు కేసీఆర్ నివాసంలో నోటీసులను అతికించారు.

నిరసనలకు BRS పిలుపు
ఈ నోటీసులను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మొదటిసారి ఇచ్చిన సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమయం ఇవ్వాలని కోరారని చెబుతున్నారు. కానీ సమయం ఇవ్వకుండా వెంటనే విచారణకు హాజరుకావాలని చెప్పటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1(ఆదివారం)వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
“ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ని వేధిస్తోంది. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ (SIT) విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన మరియు నీచమైన వైఖరి. రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలి" అని బీఆర్ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
“ప్రతి మున్సిపల్ మరియు నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు మరియు రాస్తారోకోలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాలి. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలి. పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలి” అని నేతలు కోరారు.
అహంకారం కాకపోతే మరేమిటి..? కేటీఆర్
“తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
విచారణకు కేసీఆర్…!
సిట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఉదయం నుంచి న్యాయవాదులతో కేసీఆర్ తో సహా పలువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే కేసీఆర్ విచారణకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎర్రవెల్లి నుంచి నందినగర్ కు వచ్చి అందుబాటులో ఉండనున్నారు. పోలీస్ స్టేషన్ కాకుండా కేసీఆర్ నివాసంలోనే రేపు మధ్యాహ్నం సిట్ అధికారులు విచారిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

