తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత - బ్లాక్ టీషర్టులతో BRS ఎమ్మెల్యేలు, టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన

BRS Protest at Telangana Assembly : కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్లతో అసెంబ్లీ వద్ద తీవ్ర నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్, హరీష్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published on: Sep 7, 2026, 10:29:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRS Protest at Telangana Assembly : తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభమయ్యాయి. అయితే అంతకంటే ముందు అసెంబ్లీ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ విఫల పాలనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల రంగు టీషర్టులు ధరించి అసెంబ్లీ ముట్టడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఈ 1000 రోజుల పాలనలో ప్రజలకు సాధించిపెట్టిందేమీ లేదని రాసి ఉన్న నినాదాల టీషర్ట్లతో ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి తరలివచ్చారు.

ఎమ్మెల్యే హరీశ్ రావ్
ఎమ్మెల్యే హరీశ్ రావ్

అడ్డుకున్న పోలీసులు….

అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద నల్ల టీషర్టులతో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. పోలీసులు, నాయకుల మధ్య జరిగిన ఈ తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాలికి తీవ్ర గాయమైంది.

మరోవైపు పోలీసులు తనను మహిళ అని కూడా చూడకుండా తీవ్రంగా అవమానించారంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అసెంబ్లీ గేటు ముందే కంటతడి పెట్టారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు తన టీషర్ట్‌ను విప్పి వేసి గేటు వద్దే నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ గేటు ముందే బైఠాయించి ధర్నాకు దిగిన కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

నెలపాటు సభ జరపాలి - కేటీఆర్

అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "శాసనసభ సమావేశాలను ఏదో తూతూమంత్రంగా రెండు మూడు రోజులు నిర్వహించి మమ అనిపిస్తే కుదరదు. ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి కనీసం నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహించాలి. సభలో అన్ని ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా శాసనసభ స్పీకర్ గారే చొరవ తీసుకోవాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎదురవుతున్న ప్రజా సమస్యలను సభలో ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. "రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 7 డిఎలు (DA) పెండింగ్‌లో ఉన్నాయి. జీతాలు, డీఏలు రాక ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్యమ బాట పట్టారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున, వారి హక్కుల కోసం బీఆర్ఎస్ శాసనసభలో గొంతు విప్పుతుంది. అలాగే రాష్ట్రంలో 22A నిషేధిత భూముల పేరిట జరుగుతున్న భారీ కుంభకోణంపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం," అని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష నిరసనలను పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను వారు తీవ్రంగా ఖండించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More