ఢిల్లీలో విద్యార్థులకు సంఘీభావంగా ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొననున్న కేటీఆర్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసనలకు మద్దతు ఇచ్చారు. సంఘీభావంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో చేసే ధర్నాలో పాల్గొంటారు.

Published on: Jul 23, 2026, 12:00:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన అణచివేత చర్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ యువత శక్తివంతమైన గొంతుకను, వారి ఆకాంక్షలను పోలీసు బలగాల ప్రయోగంతో నొక్కేయడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

కేటీఆర్
కేటీఆర్

ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదిక (X) ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న దాష్టీకానికి వ్యతిరేకంగా, వారికి సంఘీభావం తెలపడానికి బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.

జులై 24 ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్‌లో ధర్నా ఉండనుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో నేరుగా పాల్గొననున్నట్లు కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. 'జులై 24న ఉదయం 10:00 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బీఆర్‌ఎస్‌వీ చేపట్టే మహా ధర్నాలో నేను కూడా పాల్గొంటున్నాను.' అని కేటీఆర్ వెల్లడించారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. "నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కును కాపాడుకోవడానికి విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులంతా కలిసికట్టుగా ముందుకు రావాలి. మన నిరసన గళాన్ని బలంగా వినిపిద్దాం." అని ఆయన పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో విద్యా రంగానికి సంబంధించిన సమస్యలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసనలు నిర్వహిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యా మంద్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ ఆందోళనల సమయంలో విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి.

భారతదేశంలో జెన్-జీ, యువత నుంచి తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమయ్యే అవకాశముందని, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఘటనల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు ఇందిరా పార్క్ ధర్నాకు తరలిరావాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు కూడా కోరారు.

విద్యా సంస్థలు బంద్

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జులై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు విద్యార్థి నాయకులు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. విద్యా హక్కులు, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని వామపక్ష విద్యార్థి సంఘాల (AISF, SFI, PDSU తదితర) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఢిల్లీలో విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల భద్రతను, భవిష్యత్తును గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU)తో పాటు కేయూ (KU), పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. జులై 24న జరగబోయే ఈ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు యూనివర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More