Kondagattu Temple : కొండగట్టులో చందనోత్సవం - 60 ఏళ్లకు ఒకసారి అరుదైన మహాఘట్టం! భక్తులకు నిజరూప దర్శన భాగ్యం, తేదీలివే
Kondagattu Anjaneya Swamy Chandanotsavam : జగిత్యాల కొండగట్టు అంజన్న ఆలయంలో 60 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన చందనోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 15 నుంచి 20 వరకు పూజల అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభించనుంది.
Kondagattu Anjaneya Swamy Chandanotsavam : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, భక్తుల కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒక అత్యంత అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టానికి ఆలయ అధికారులు, అర్చక బృందం శ్రీకారం చుడుతున్నారు. అత్యంత పవిత్రమైన 'చందనోత్సవం' వేడుకను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. 60 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ మహాఘట్టం అనంతరం, భక్తులకు స్వామివారు తమ నిజరూపంలో దర్శనమివ్వనున్నారు.

ఈనెల 15 నుంచి చందనోత్సవం
ఈ నెల (నవంబర్) 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయంలో చందనోత్సవం మరియు మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.
కొండగట్టులో స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామివారి గర్భగుడిలోని మూలవిరాట్‌కు గత 60 ఏళ్లుగా ప్రతి మంగళవారం, శనివారాల్లో నియమనిష్టలతో చందనం పూస్తూ వస్తున్నారు. ఈ సుదీర్ఘ కాలక్రమంలో స్వామివారి విగ్రహంపై చందనం సుమారు 7 అంగుళాల మందంలో పేరుకుపోయింది. దీనివల్ల స్వామివారి నిజరూప పరిపూర్ణ దర్శనం భక్తులకు కలగడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు, వేద పండితులు మరియు అర్చకులు చర్చించి మూలవిరాట్టుపై పేరుకుపోయిన ఈ చందనాన్ని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనినే 'చందనోత్సవం' అని పిలుస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
నవంబర్ 15 నుంచి 20 వరకు జరిగే ఈ పవిత్ర చందనోత్సవ ప్రక్రియ సాధారణంగా జరిగే పూజ కాదు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దశమహావిద్యల సాధకులు, తాంత్రిక గురువులు, వేద రుత్వికులు, వివిధ పీఠాధిపతుల ప్రత్యక్ష ఆధ్వర్యంలో మరియు వారి శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఈ క్రతువు జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు రకాల ఆర్జిత సేవలు రద్దవుతాయి.
ఈ ఐదు రోజుల వ్యవధిలో గర్భగుడిలోని మూలవిరాట్ స్వామివారి దర్శనం ఎవరికీ లభించదు. ఎంతటి ప్రముఖులకైనా అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలోనే స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.
నిజరూప దర్శనం!
చందనోత్సవం, విశేష పూజలు మరియు మహాసంప్రోక్షణ ముగిసిన అనంతరం.. నవంబర్ 21వ తేదీ నుంచి భక్తులకు అంజన్న నిజరూప దర్శనం కలగనుంది. డిసెంబర్ 20వ తేదీ వరకు మాత్రమే భక్తులు ఆంజనేయ స్వామివారి నిజరూపాన్ని కళ్లారా చూసి తరించే అరుదైన అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే స్వామివారికి చందన సమర్పణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
"బాల్యదశలో ఈ చందనోత్సవాన్ని కనులారా చూసినవారు, మళ్లీ తమ జీవిత మలిదశలోనే ఈ భాగ్యాన్ని పొందుతారు. ఇది ఈ జన్మలో లభించే గొప్ప అదృష్టం," అని ఆలయ అర్చకులు వెల్లడించారు.
స్వామివారి నిజరూప దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. చందనోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

