Simhachalam Chandanotsavam 2026 : సింహాచలంలో చందనోత్సవం - ఈ ఒక్కరోజే అప్పన్న స్వామి నిజరూపం..! టైమింగ్స్ వివరాలివే

Simhachalam Chandanotsavam 2026 : సింహాచలంలో అక్షయ తృతీయ పురస్కరించుకుని చందనోత్సవం వైభవంగా జరగనుంది. ఏప్రిల్ 20న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కల్పించనున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Apr 19, 2026, 15:07:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Simhachalam Chandanotsavam 2026 : విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి వారి చందనోత్సవానికి సర్వం సిద్ధమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 20వ తేదీన స్వామి వారు భక్తులకు నిజరూపంలో దర్శనమివ్వనున్నారు.

సింహాచలం
సింహాచలం

ఏడాదిలో ఒక్కసారి మాత్రమే…!

ఏడాది పొడవునా సుమారు 500 కిలోల చందన లేపనంలో ఒదిగి ఉండే సింహాద్రి అప్పన్న, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి తన అసలు రూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరానున్నారు.

సింహాద్రి అప్పన్న స్వామి వారిని ఏడాది పొడవునా చందన ముద్దతో కప్పబడిన లింగ రూపంలోనే భక్తులు దర్శించుకుంటారు. అయితే అక్షయ తృతీయ నాడు నిర్వహించే చందనోత్సవం అత్యంత విశిష్టమైనది. స్వామి వారి దేహంపై ఉన్న చందనాన్ని శాస్త్రోక్తంగా ఒలిచి…. కేవలం ఈ ఒక్క రోజే ఆయన నిజరూపాన్ని ప్రదర్శిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, నీడ, తాగునీరు వంటి కనీస వసతులను సిద్ధం చేశారు.

దర్శనం టైమింగ్స్:

  • ఏప్రిల్ 20వ తేదీ వేకువజాము నుంచే ఆలయంలో వైదిక క్రతువులు ప్రారంభం కానున్నాయి.
  • వేకువజామున 1:00 గంటలకు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
  • 1:00 నుంచి 3:00 గంటల వరకు: శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు, స్వామి దేహంపై నుంచి చందనం ఒలుపు క్రతువు నిర్వహిస్తారు.
  • ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు మరియు వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి తొలి దర్శనం కల్పిస్తారు.
  • ఉదయం 3:30 గంటలకు: సామాన్య భక్తులను దర్శనాల కోసం క్యూలైన్లలోకి అనుమతిస్తారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాల విషయంలో అధికారులు స్పష్టమైన గడువును నిర్ణయించారు. రాత్రి 7 గంటలకు అన్ని క్యూలైన్ల ప్రవేశ మార్గాలను అధికారులు మూసివేస్తారు. అయితే అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ రాత్రి 11 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తుల రక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సింహాచలం కొండపైకి వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More