ప్రయాణికులకు అలర్ట్.. తెలంగాణలోని ఈ రైల్వే స్టేషన్‌లో సరికొత్త రూల్స్.. జూన్ 15 నుంచే అమలు!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కొత్త విధానం అమల్లోకి తెస్తుంది. జూన్ 15 నుంచే మెుదలుకానుంది.
సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు.. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఒక ఆధునిక కోచింగ్ టెర్మినల్‌గా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సరికొత్త టెర్మినల్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం, వాహనాల రద్దీని నియంత్రించేందుకు జూన్ 15, 2026 నుండి 'యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్' విధానాన్ని అమలు చేయబోతున్నారు.

రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ కొత్త భవనం(ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు) వద్దకు వచ్చే ప్రయాణికుల పికప్, డ్రాప్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త సౌత్ టెర్మినల్ భవనం (ప్లాట్‌ఫారమ్ నం. 9 వైపు) ప్రయాణికులకు మంచి అనుభూతిని ఇచ్చేలా ఆధునికీకరించారు.
ఇక్కడ విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక ప్లాట్‌ఫారమ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మరియు ప్రీమియం మోడ్యులర్ టాయిలెట్లు, మెరుగైన సైనేజ్ (దిశానిర్దేశ సూచికలు), డిజిటల్ సమాచార కేంద్రాలు, ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం 6,622.09 చదరపు మీటర్ల భారీ పార్కింగ్ స్థలం ఉన్నది.
రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అనధికారిక పార్కింగ్‌ను అరికట్టడానికి, సులభంగా వాహనాలు వచ్చి వెళ్లడానికి ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులను దించడానికి, ఎక్కించుకోవడానికి వచ్చే వాహనాలకు మొదటి 20 నిమిషాలు ఎలాంటి ఛార్జీలు ఉండవు(ఉచితం). ఒకవేళ వాహనాలు 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం స్టేషన్ ముఖద్వారం వద్ద నిలిపి ఉంచితే భారీగా జరిమానా తరహా ఛార్జీలు పడతాయి.
నిర్దేశిత పార్కింగ్(జనరల్ పార్కింగ్) ప్రాంతంలో పార్కింగ్ టారిఫ్ మెుదటి రెండు గంటలు నాలుగు చక్రాల వాహనాలకు రూ.20, రెండు, మూడు చక్రాల వాహనాలకు రూ.15గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతీ తదుపరి గంటకు రూ.10 చొప్పున వసూలు చేస్తారు.
15.06.2026 తేదీన అర్ధరాత్రి నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది . ఈ వ్యవస్థ 2, 3, 4 చక్రాల వాహనాల కోసం ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేసి, నిరాటంకమైన పికప్, డ్రాప్-ఆఫ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించబడింది. స్టేషన్ భవనం ముందు పాదచారుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటంతో పాటు, ఈ వ్యవస్థ రద్దీని తగ్గించి, ఆటోలు, టాక్సీలు, ఇతర రవాణా సాధనాలకు సులభంగా ప్రవేశాన్ని కల్పిస్తుంది.
ఇక్కడ పికప్/డ్రాప్-ఆఫ్ కోసం 20 నిమిషాలలోపు ఉచిత నిష్క్రమణ ఉంటుంది. ప్రాంగణంలోకి ప్రవేశించే అన్ని వాహనాలకు డిజిటల్ టికెటింగ్ ఉంటుంది. ప్రవేశ/నిష్క్రమణ సమయాలు, రుసుములతో కూడిన డిజిటల్ రసీదులు ఇస్తారు. ఉచిత సమయ పరిమితులు దాటిన తర్వాత మాత్రమే అదనపు బస ఛార్జీలు వర్తిస్తాయి. నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఛార్జీ విధించారు.
యాక్సెస్ కంట్రోల్ ఛార్జీలు (2, 3, 4 చక్రాల వాహనాలు)కు చూసుకుంటే.. 20 నిమిషాల లోపు ఉచితంగా పికప్, డ్రాప్ ఉంటుంది. 00 - 20 నిమిషాలు ఏమీ లేదు. 20 - 30 నిమిషాలు రూ.50, 30 - 45 నిమిషాలు రూ.100, 45 - 60 నిమిషాలు రూ. 200, 60 నిమిషాలకు మించి ఉంటే రూ.500గా ఉంటుంది.
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులకు, సందర్శకులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అనధికార పార్కింగ్‌ను నివారించడం, ప్రవేశ నిష్క్రమణలను నియంత్రించడం ద్వారా ఈ వ్యవస్థ ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేసి, స్టేషన్ ముందు భాగంలో రద్దీని తగ్గిస్తుంది. ఇది పాదచారుల సురక్షితమైన, నిరాటంకమైన రాకపోకలకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఆటోలు, టాక్సీలు, బస్సులు, ఇతర రవాణా సాధనాలను ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా పొందగలుగుతారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


