Telangana Govt : 100 నియోజకవర్గాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' - ఈ ఏడాది నుంచే ప్రారంభం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) ‘తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌’ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని చెప్పారు. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాలన్నారు.

Published on: Feb 26, 2026, 23:18:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న ఆరుట్ల(రంగారెడ్డి జిల్లా) తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో విద్యా శాఖపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌మైన విద్య‌కు చిరునామాగా తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

  • "కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (CURE) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌హాలో నిర్మించాలి. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాలి.
  • హైదరాబాద్ లోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండాలి.
  • క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శాల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌కూడ‌రాదు.
  • ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాలి. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలి.
  • కృత్రిమ మేథ (#AI) ప్ర‌పంచాన్ని శాసిస్తున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స్థాయి నుంచి దాని బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాలి. మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఏర్పాటు చేయాలి.
  • సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకురావాలి. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాలి.
  • బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్ర‌తి విద్యార్థికి పాలు అంద‌జేయాలి. పాల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌రించాలి. విద్యార్థుల‌కు ఎన్ని క్యాల‌రీలు అంద‌జేస్తున్నామ‌నేది తెలుసుకునేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించాలి.
  • పాఠ‌శాల విద్యార్థుల‌కు స్కూల్ యూనిఫాం, పుస్త‌కాల‌తో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అంద‌జేయాలి. ఆ కిట్ లో స్కూల్ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప‌న‌ర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్ష‌న‌రీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బ‌డ్జెట్‌లో పొందుప‌ర్చాలి.
  • పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంట‌నే ప్రారంభించాలి. కాలం చెల్లిన కోర్సుల‌ను తొల‌గించాల‌న్నారు. పాలిటెక్నిక్‌, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంట‌నే వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు ల‌భించేలా చూడాలి.
  • రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు కేటాయిస్తాం. ఇప్ప‌టికే ఉస్మానియా యూనివ‌ర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, మిగ‌తా వ‌ర్సిటీల‌కు ఎంత నిధులు అవ‌స‌ర‌మ‌నే దానిపై నివేదిక స‌మ‌ర్పించాలి.
  • ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠ‌శాల‌ల ఫీజు రెగ్యుల‌ట‌రీ మానిట‌రింగ్ క‌మిష‌న్ త‌మ నివేదికలోని అంశాల‌ను ముఖ్య‌మంత్రి గారి ముందుంచారు. వివిధ రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న విధానాలు, తెలంగాణ‌లో తీసుకోవాల్సిన అంశాల‌ను వివ‌రించారు.
  • వివరాలు తెలుసుకున్న అనంతరం జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్‌, డీఈవోల నేతృత్వంలో పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి ఫీజుల నిర్ణ‌యంపై నివేదిక స‌మ‌ర్పించాలి.

రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయిలోని క‌మిటీ తుది క‌మిటీగా ఉండి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ఫీజు నియంత్ర‌ణ‌కు సంబంధించి విద్యార్థుల త‌ల్లిదండ్రులు, మేధావులు, సామాజిక‌వేత్త‌ల అభిప్రాయ సేక‌ర‌ణ‌కు ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల‌ని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More