Hyderabad : క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా... ఎక్క‌డైనా చెత్త క‌న‌ప‌డితే స‌హించేది లేదు - సీఎం రేవంత్ వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. కోర్ అర్బన్ ప్రాంతంలోని 3 న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్దపీఠ వేయాలన్నారు. ఎక్క‌డైనా చెత్త క‌న‌ప‌డితే స‌హించ‌మ‌ని హెచ్చరించారు. వీధి దీపాల నిర్వ‌హ‌ణ విషయంలో యూనికోడ్ సిస్ట‌మ్ అనుస‌రించాల‌ని దిశానిర్దేశం చేశారు.

Published on: Feb 18, 2026, 05:10:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలోని మూడు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రత విషయంలో క్షేత్రస్థాయిలో ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీల‌న‌ చేస్తానని… ఎక్క‌డైనా చెత్త క‌న‌ప‌డితే స‌హించ‌మ‌ని అధికారుల‌ను హెచ్చ‌రించారు.

సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి - సీఎం రేవంత్

హైద‌రాబాద్‌ , మల్కాజ్‌గిరి , సైబరాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌ల క‌మిష‌న‌ర్లు తెల్ల‌వారుజామున ఆరు గంట‌ల‌కే క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని ఆదేశించారు. పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలో ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం పెంపు పాల‌సీపై స‌మీక్షించారు. వివిధ అంశాలపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

“న‌గ‌రంలో కూడ‌ళ్లు, ఇత‌ర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి. ఎల‌క్ట్రిక్‌, ఇత‌ర కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్ర‌క‌ట‌న‌ల బోర్డులు వాటిపై ఏర్పాటు చేసే అంశాన్ని ప‌రిశీలించాలి. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లోనూ మ‌ల్టీలెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవ‌కాశాల‌ను అధ్యయనం చేయాలి. నెక్లెస్ రోడ్డు ప‌క్క‌న ప‌లు ప్రాంతాల్లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవ‌కాశాల‌ను పరిశీలించాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ ర‌కాల‌ బోర్డులు క‌నిపిస్తున్నా ఆశించిన ఆదాయం రాక‌పోవ‌డంపై ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ముంబ‌యి, అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూర్‌ల్లోని ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంతో న‌గ‌రంలో వ‌స్తున్న ఆదాయాన్ని బేరీజు వేయాలని చెప్పారు. ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌క‌ట‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్ర‌క‌ట‌న‌ల‌కు 10 శాతం బోర్డులు కేటాయించాల‌ని సీఎం రేవంత్ సూచించారు. ఈ సంద‌ర్భంగా పీపీపీ, ఇత‌ర న‌మూనాల్లో ఆదాయం స‌మ‌కూర్చుకునే అంశంపై అధికారులు ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. దానిని ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి… ప‌లు సూచ‌న‌లు చేశారు.

మూడు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌తో పాటు రాష్ట్రంలోని అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో వీధి దీపాల నిర్వ‌హ‌ణ విషయంలో యూనికోడ్ సిస్ట‌మ్ అనుస‌రించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్పొరేషన్ల పరిధిలోని పార్కుల వివ‌రాలు, వాటి అభివృద్ధిపైన ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సూచించారు.

ఒక్క రోజు శిక్షణ…

రాష్ట్రంలో నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, ఛైర్మ‌న్లు, డిప్యూటీ ఛైర్మ‌న్ల‌తో త్వ‌ర‌లోనే ఒక్క రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల అభివృద్దికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ఇత‌ర అంశాల‌ను సమగ్రంగా వివ‌రించాల‌ని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More