TG Govt Prajavani : ఇకపై రెవెన్యూ డివిజన్, మండ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Revanth Reddy On Prajavani : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మరింత బలోపేతం చేయనుంది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా… ప్రజావాణి సేవలను రెవెన్యూ డివిజన్, మండల స్థాయికి విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy On Prajavani : రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్ 8వ తేదీన) ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది.
అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజావాణి….
దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు గారితో పాటు సీఎంవో అధికారులను ఆదేశించారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని చెప్పారు. తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు.
ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు.
ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని…. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. డ్యాష్‌బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలని చెప్పారు.
ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కిందిస్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

