డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్'

తెలంగాణ బ్రాండింగ్‌ విశ్వవ్యాప్తమయ్యే విధంగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే సదస్సుపై సమీక్షించిన ఆయన… ఉన్నతాధికారులకు శాఖల వారిగా అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు.

Published on: Nov 26, 2025, 06:58:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు సంబంధించి అనుకూల అంశాలతో పాటు ప్రభుత్వం క‌ల్పించే స‌దుపాయాల‌ను సమ్మిట్ లో స‌మ‌గ్రంగా వివ‌రించాల‌ని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

2 రోజులపాటు సమ్మిట్…

డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వ‌హించ‌నున్న స‌మ్మిట్‌కు సంబంధించి బ్రాండింగ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ కీలక సూచనలు…

గ్లోబ‌ల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ సంస్థ‌లు రూపొందించిన ప్ర‌చార చిత్రాలు, వీడియోలను వీక్షించి ప‌లు మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో విభాగాల వారీగా మ‌నం చేప‌ట్టే ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌తి అంశాన్ని ప్ర‌చారంలో ప్ర‌ముఖంగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డాల‌ని తెలిపారు.

పెట్టుబ‌డిదారుల‌కు హైద‌రాబాద్‌కు అనుకూలాంశాలైన ఇన్న‌ర్ రింగు రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు, రానున్న రీజిన‌ల్ రింగు రోడ్డు, బంద‌రు పోర్ట్ వ‌ర‌కు నిర్మించ‌నున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రైపోర్ట్ తో పాటు తెలంగాణ‌లోని క‌ళా, సాంస్కృతిక, భాష, వాతావ‌ర‌ణ అనుకూల‌త‌ను వివ‌రించాల‌ని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో ఎటువంటి మార్పులేని అంశాన్ని, పెట్టుబ‌డుల విష‌యంలో మద్ద‌తుగా నిలుస్తున్న విష‌యాన్ని బ‌లంగా నొక్కి చెప్పాల‌ని సూచించారు.

తెలంగాణ బ్రాండింగ్‌కు సంబంధించి మ‌న రాష్ట్రానికే ప‌రిమిత‌మైన, వైవిధ్య‌మైన‌ రామ‌ప్ప ఆల‌యంలోని నంది, స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌, న‌ల్ల‌మ‌ల్ల పులులు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకే ప్ర‌త్యేక‌మైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజ‌కీయాల‌ను శాసించిన పి.వి.న‌ర‌సింహారావు వంటి ప్ర‌ముఖులు, క‌ళాకారులు, క్రీడాకారులు, అంత‌ర్జాతీయ కంపెనీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర‌ముఖులు ఇలా ప్ర‌తి ఒక్క‌దానికి బ్రాండింగ్‌లో చోటు క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్ వేదిక‌ల‌ను బ్రాండింగ్‌కు స‌మ‌ర్థంగా వినియోగించాల‌ని దిశానిర్దేశం చేశారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు.

నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCCలో పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలను నిర్వహిస్తారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుదిమెరుగులు దిద్దనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More