ఇందిరమ్మ ఇంట సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు - లబ్ధిదారుడి ఇంట్లో భోజనం

దీపావళి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. లబ్ధిదారుడి కొత్త ఇంట్లో స్పీకర్, మంత్రులతో కలిసి భోజనం చేశారు.

Published on: Nov 9, 2026, 07:16:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండగ వేళ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం లబ్ధిదారులతో కలిసి ఆదివారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఇందిరమ్మ ఇంట సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు
ఇందిరమ్మ ఇంట సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు

కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని పర్సాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే ఇంట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలసి భోజనం చేశారు. లబ్ధిదారుడి కుటుంబ సభ్యులతో ముచ్చటించి, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

జీవిత కాలపు జ్ఞాపకం - సీఎం రేవంత్

“కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర–శ్రీనివాస్ దంపతులు నూతననంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించాను. కొత్త ఇంట్లో వారికి పట్టు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపాను. నా జన్మదినం రోజున ఆ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొనడం, వారి సంతోషాన్ని పంచుకోవడం నాకు జీవిత కాలపు జ్ఞాపకం” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియంను సీఎం ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా దుద్యాలలో సమీకృత మండల కార్యాలయ భవనాన్ని, దౌల్తాబాద్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అలాగే కొడంగల్‌లో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ భవనాలతో పాటు హకీంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పిహెచ్‌సి) ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు…

మరోవైపు షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలతో కలసి పండుగ జరుపుకున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More