'ఇదా సీఎం వాడే భాష..? కొడంగల్ లో కూడా నిన్ను గెలవనీయం' - రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడినని.. మాట్లాడమంటే ఉర్దూలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టే తెలివి ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడిస్తామని కామెంట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారు అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేకనే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రశ్నిస్తే తప్పా…? కేటీఆర్
తెలంగాణ భవన్ లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "మొన్న కేసీఆర్ గారు ఏమడిగారు? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పండపెట్టినవు అని అడిగారు. ఎనిమిది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వెనక్కి పంపినా, దానిని మళ్ళీ పంపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సోయి ఈ ముఖ్యమంత్రికి ఉందా? 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్లు వస్తాయి, ఆ పని చేయమని అడగడం తప్పా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.🔸
కృష్ణా జలాల విషయంలో మోదీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.
“ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? నెలకు రూ. 4000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు రూ. 2500 ఇస్తామని 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు ఏమయ్యాయి? రెండేళ్లు దాటినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడం ఏంటి..?” అని కేటీఆర్ నిలదీశారు.
"రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టాలని నాకు లేదు. కానీ, తెలంగాణ తెచ్చిన నాయకుడిని, రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రిని, నా తండ్రిని మీరు తిడుతుంటే ఒక కొడుకుగా నాకు ఆవేశం రాదా? కేసీఆర్‌ను రోజు తిడుతూనే ఉన్నాడు. ఒకరోజు చనిపోవాలనుకుంటాడు, ఒకరోజు కాలు విరిగింది అంటాడు, ఇంకోరోజు ఇంకేదో అంటారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము కాబట్టి కుర్చీకి ఇచ్చే గౌరవంతో ఊరుకుంటున్నాం. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండబెట్టినట్టు ఉంది నేటి పరిస్థితి" అని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.
"ఢిల్లీలో పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, ఇప్పుడు కూడా నెల నెలా ఢిల్లీకి పైసలు పంపిస్తూ పదవి కాపాడుకుంటున్నావు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలని… కానీ మీలో రోజూ ఈ ఏడుపు ఎందుకు?" అని కేటీఆర్ నిలదీశారు.
"నీ అమ్మ, నీ అయ్య.. గీదా నీకు నేర్పిన భాష? గత రెండేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం, కేవలం తిట్లు తిట్టడం తప్ప నీకు ఏమీ రాదు. కుర్చీకి ఇచ్చే గౌరవంతోనే ఊరుకుంటున్నాం. నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి పదవి దక్కింది. కానీ నీ తీరు చూస్తుంటే 'కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టు' ఉంది" అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
"నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు నొప్పి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది. ఆ సమయంలో నేను గుంటూరులోనే కాకుండా హైదరాబాద్, పూణే, అమెరికా.. ఇలా ప్రపంచమంతా చదువుకున్నాను" అని స్పష్టం చేశారు. నేను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంటున్న రేవంత్… ఆంధ్రా నుంచి అల్లుణ్ణి తెచ్చుకోవడం తప్పు కాదా? అందుకే ఈయనకు 'భీమవరం బుల్లోడు' అని పేరు పెడితే సరిపోతుంది" అని ఎద్దేవా చేశారు.
కొడంగల్ లో ఓడిస్తాం - కేటీఆర్
"కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని కానీయను అని శపథాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఒకటే చెబుతున్నా.. నీకు సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చెయ్. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్‌లో కూడా గెలవనీయకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి" అని కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

E-Paper












