'యూరియా యాప్' పేరుతో లైన్లను దాచే కుట్ర - ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి 'యూరియా యాప్' ఒక నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల లైన్లు, తమ చేతగానితనం బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ 'మొబైల్ యాప్ నాటకాన్ని' మొదలుపెట్టిందని విమర్శించారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని…. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసి, అన్ని అంశాల్లో ప్రజలను పట్టిపీడిస్తోందని ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. యూరియా యాప్, రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.
యూరియా యాప్ నాటకం : కేటీఆర్
రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ 'మొబైల్ యాప్ నాటకాన్ని' కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎవరూ హరించలేరని, గ్రామాల్లో సర్పంచులే అసలైన కథానాయకులని కేటీఆర్ చెప్పారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, విధులు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా సర్పంచులకే చెల్లుతాయని స్పష్టం చేశారు. ఇందులో ఏ ఎమ్మెల్యే లేదా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి సొంత ఆస్తి కాదని, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అని గుర్తు చేశారు. మనం కేవలం ఆ ప్రజా ధనానికి ధర్మకర్తలుగా ఉండి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసినా… కనీసం ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నిధులు లేక ఇబ్బంది పడుతున్నారని, ఒక ఎమ్మెల్యే అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉందని మండిపడ్డారు.
తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, 67 మంది సర్పంచులు గెలవడం శుభపరిణామమని కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లు నిధుల పరంగా కొంత ఇబ్బంది ఉన్నా… ప్రజల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, చేస్తున్న అప్పులను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

