'హిల్ట్' పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట - పారిశ్రామికవాడల్లో పర్యటనలు
HILTP పాలసీతో 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై పోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ పాలసీతో రాష్ట్ర ప్రజలకు కలిగే నష్టంపై నిజనిర్ధారణ కోసం 8 కమిటీలను ఏర్పాటు చేసింది. వీరంతా పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తారు.
‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనిలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు…. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన 'నిజనిర్ధారణ బృందాలను' నియమించారు.

ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు. రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం నిజా నిజాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు.
ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర - కేటీఆర్
టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ (Multi-Use Zone) పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు.
క్షేత్రస్థాయి పర్యటనలు….
ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. వీటితో పాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు.
ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును ప్రభుత్వం కేటాయించిన తీరును వాటిని అత్యంత చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు ప్రస్తావించనున్నాయి. డిసెంబర్ 03, 04 తేదీలలో హెచ్‌ఐఎల్‌టీపీ (HILTP) స్కామ్‌పై నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.
- క్లస్టర్-1లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావ్ నేతృత్వంలో ఎమ్మెల్యే గంగుల, దేశపతి శ్రీనివాస్ మరియు మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారు.
- క్లస్టర్-2లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీ దేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు.
- క్లస్టర్-3లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, మర్రిరాజశేఖర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు మౌలాలి మరియు కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేస్తారు.
- ముఖ్యంగా క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,కెపీ వివేకానంద, మాధవరం కృష్ణారావుతో కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
- క్లస్టర్-5లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు.
- క్లస్టర్-6లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు.
- క్లస్టర్-7లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, స్వామి గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి కాటేదాన్ మరియు హయత్ నగర్ లో పర్యటిస్తారు.
- చివరగా క్లస్టర్-8లో మాజీ మంత్రి మహముద్ అలీ, శ్రవణ్ దాసోజ ఎండీ సలీం చందులాల్ బారాదరి పారిశ్రామిక వాడను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

