హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కు కుట్ర - సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆరోపణలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Nov 21, 2025, 15:06:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. అది పాలసీ కాదని… రూ. 5 లక్షల కోట్ల స్కామ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రవేట్ వ్యక్తులకు అప్పచెబుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం
తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం

అతి పెద్ద భూకుంభకోణం…

పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్‌లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉందని కేటీఆర్ తెలిపారు. దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని వివరించారు. అలాంటి భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30 శాతానికే అప్పగించాలని చూస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ఎస్ఆర్‌ఓ రేట్ల కంటే 100 శాతం నుంచి 200 శాతం అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. కానీ కాంగ్రెస్ కేవలం 30 శాతానికే చేయాలని చూస్తోంది… ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? అని కేటీఆర్ ప్రశ్నించారు.

“కనీసం ఎస్ఆర్‌ఓను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదు. కేవలం 30 శాతం మాత్రమే తీసుకుంటున్నారు. మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయి. చాలా సందర్భాల్లో ప్రజల నుంచి భూములను సేకరించి పారిశ్రామికవేత్తలకు అనేక రైతులతో ఇచ్చిన ఈ భూములను ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల కోసం రెగ్యులరైజ్ చేస్తామంటే కుదరదు. ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక భూమిని ఇచ్చాయి. అది ఉద్దేశం. కానీ ఇప్పుడు, అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారు” అని కేటీఆర్ అన్నారు.

“మా హయాంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనం కోసం చౌకగా ఇవ్వలేము. మేము అప్పుడు తిరస్కరించాం. కానీ మేము ఆపిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు. ఈ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం అత్యంత అనుమానాస్పదంగా ఉంది. 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయమని చెప్పడం పై అనుమానంగా ఉంది. లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందరా…? ఎందుకీ వేగవంతమైన ప్రక్రియ?” అని కేటీఆర్ ప్రశ్నించారు

ముందుగానే డీల్ చేసుకున్నారు - కేటీఆర్

రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు మరియు మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కుదిరాయన్నారు. ‘కాంగ్రెస్ HILTPని ఏటీఎం గా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఐఎల్‌టీపీ వెనుక ఉన్న ఉద్దేశం పట్టణాభివృద్ధి కాదని…. ఎంపిక చేసిన కొద్దిమందిని పెద్దఎత్తున ధనవంతులుగా మార్చడమేనని దుయ్యబట్టారు.

హెచ్‌ఐఎల్‌టీపీ కింద డీల్స్ కుదుర్చుకునే వారికి కేటీఆర్ నేరుగా హెచ్చరిక జారీ చేశారు. “ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. ఈ లావాదేవీలు నిలబడవు. ఆ భూమిని తిరిగి తీసుకుంటాం. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దు చేసి, తగిన చర్యలు ప్రారంభిస్తుంది” అని ఆయన అన్నారు.

గవర్నర్ అనుమతి - కేటీఆర్ రియాక్షన్

ఫార్ములా-ఈ కార్‌ కేసులో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అనుమతించిన విషయంపై కూడా కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని పునరుద్ఘాటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More