ఎల్‌నినో ఎఫెక్ట్.. 45 రోజుల్లో చేతికి వచ్చేలా శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు.. వారికి బాధ్యతలు

ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావంతో పశుగ్రాసానికి ఏర్పడగల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని శిఖం భూముల్లో (నీటి వనరుల ముంపు ప్రాంతాల్లో ఉండే భూములు) పశుగ్రాసాన్ని సాగు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Published on: Oct 15, 2026, 09:33:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడే పశుగ్రాసం కొరతను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంటల పరిధిలోని శిఖం భూముల్లో పశుగ్రాసాన్ని సాగు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ముందస్తు చర్యల ప్రణాళికను ఖరారు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

నీటి లభ్యత ఉన్న చెరువులు, జలాశయాల సమీపంలో ఉన్న 5 నుంచి 10 ఎకరాల శిఖం భూములను ఈ సాగు కోసం వినియోగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పశుగ్రాసం కొరత తీవ్రం కాకుండా ఉండటానికి రాబోయే 45 రోజుల్లో పంట చేతికి వచ్చేలా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.

ఈ మొత్తం ప్రాజెక్టు నిర్వాహణ బాధ్యతలను గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) అప్పగించారు. విత్తనాలు చల్లడం, పంట సంరక్షణ, నీటి యాజమాన్యం వరకు అన్ని బాధ్యతలను వీరే చూసుకుంటారు. దీనివల్ల గ్రామీణ మహిళలకు ఉపాధి కలగడమే కాకుండా, సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుంది.

ఈ పశుగ్రాసం సాగుకు కావలసిన ఆర్థిక రక్షణ, కార్మిక వ్యయాన్ని భరించేందుకు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (VB-G RAM G) నిధులను వినియోగించనున్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా నాణ్యమైన ‘CSH 24-MF’ రకం పశుగ్రాసం విత్తనాలను ఉచితంగా అందజేస్తారు. దీనివల్ల రైతులకు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భారం తగ్గుతుంది.

వేసవి, వర్షాభావ సమయాల్లో పశువుల దాహం తీర్చేందుకు చెరువుల సమీపంలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పలు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నీటిపారుదల శాఖ సాగుకు అనువైన శిఖం భూములను సర్వే చేసి గుర్తిస్తుంది.

పశుసంవర్ధక శాఖ నాణ్యమైన ఉచిత విత్తనాల సరఫరా మరియు సాంకేతిక సలహాలు అందించనుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల ద్వారా సాగును పర్యవేక్షించనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ ముఖ్య జీవనాధారం. ఎండుగడ్డి లేదా బయట మార్కెట్‌లో గ్రాసాన్ని అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి తప్పి, చిన్న/కమతాల రైతులకు మేలు జరుగుతుంది. తక్కువ వర్షపాతం నమోదైన సమయాల్లో పశువులను విక్రయించే ఆలోచన చేయకుండా రైతులను ఆదుకోవడానికి ఈ శిఖం భూముల సాగు వ్యూహం ఒక ఆశాకిరణంగా నిలుస్తుంది.

ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి కె. ఇల్లంబరితి, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More