సౌదీలో ప్రమాదానికి గురైన తెలంగాణ నర్స్ ఆవేదన.. స్వదేశానికి రప్పించాలని తల్లి కన్నీటి విజ్ఞప్తి

సౌదీ అరేబియాలో తెలంగాణకు చెందిన ఓ నర్సు ప్రమాదానికి గురైంది. ఆమెను స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

Published on: Aug 4, 2026, 18:58:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌదీ అరేబియాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన తెలంగాణ నర్సు గూగులోత్ సునీత(36)ను స్వదేశానికి రప్పించాలని ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. బ్యాంకు రుణం బకాయి ఉందన్న కారణంతో సౌదీ అధికారులు ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించడంతో ఆమె అక్కడ చిక్కుకుపోయారు.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

ఈ విషాద సంఘటనపై సునీత తల్లి గూగులోత్ పారంగి జూలై 31న సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించి, తన కుమార్తెను కాపాడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన సునీత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అనంతరం, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు 2024 సెప్టెంబర్ 7న సౌదీ అరేబియా వెళ్లారు.

అక్కడ కింగ్ అబ్దుల్లా హాస్పిటల్‌లో ఐసీయూ స్పెషలిస్ట్ నర్సుగా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది రోగులకు సేవలు అందించారు. అయితే 2025 ఏప్రిల్ 23న జరిగిన తీవ్రమైన రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో సునీత రెండు చేతులు, వెన్నుముక, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్రచికిత్సలు చేసి ఆమె శరీరంలో మెటల్ ప్లేట్లను అమర్చారు. సౌదీ మెడికల్ బోర్డు ఆమెకు 87 శాతం శాశ్వత వైకల్యం సంభవించిందని ధృవీకరిస్తూ, ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయారు.

2025 నవంబర్ నుంచి వేతనం అందకపోవడంతో, వైద్య ఖర్చులు, కనీస జీవన వ్యయాలు కూడా భరించలేక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రోడ్డు ప్రమాదానికి ముందు సునీత తన కుటుంబ అవసరాల కోసం సౌదీలోని ఒక బ్యాంకు నుండి 1,48,000 సౌదీ రియాళ్లు (సుమారు రూ. 38 లక్షలు) రుణం తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వైద్య పత్రాలను బ్యాంకుకు సమర్పించినప్పటికీ, రుణ వివాదం పరిష్కారం కాలేదు.

ఈ బకాయి కారణంతో సౌదీ అధికారులు ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించారు. మెరుగైన వైద్య చికిత్స అవసరమున్నప్పటికీ, ఈ నిషేధం వల్ల ఆమె సౌదీ వదిలి రావడానికి వీలు లేకుండా పోయింది. సునీత తన కుటుంబానికి వెన్నెముకగా నిలిచారు. తల్లి గుండె శస్త్రచికిత్స, తండ్రి మెదడు శస్త్రచికిత్స ఖర్చులను తనే భరించారు. ముగ్గురు చెల్లెళ్ల చదువు, వివాహాలు, ప్రసవ ఖర్చులను చూసుకున్నారు.

2011లో సోదరుడు మరణించడంతో, ఆయన ఇద్దరు చిన్న పిల్లల పెంపకం బాధ్యతను కూడా స్వీకరించారు. ఇప్పుడు ఆమె మంచానికే పరిమితం కావడంతో ఆ నిరుపేద కుటుంబం మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. 'నా కూతురు ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఈ రోజు నా కూతురిని కాపాడి ఇంటికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.' అని తల్లి పారంగి కన్నీరుమున్నీరయ్యారు.

తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీమ్‌రెడ్డి ఈ పిటిషన్‌ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు ఆగస్టు 4 తెలిపారు. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి ఈ వినతిని పరిశీలించి, సునీతను త్వరితగతిన స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రికి సిఫార్సు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More