ముంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరోవైపు తుఫాన్ తీవ్రత దాటికి పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతోంది. అయితే తాజాగా ఐఎండీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు :
- ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వీచే
- తెలంగాణ: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు
- మరాట్వాడా సమీప ప్రాంతాలు: నాందేడ్, హింగోలి, పర్బాణీ, విదర్భా ప్రాంతం
- మహారాష్ట్ర: బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగ్ పుర్ జిల్లాలు
ప్రజలకు ఐఎండీ సూచనలు:
- వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలి.
- వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర తిరగవద్దు.
- ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోండి.
- రైతులు పంటలు, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి.
- స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించబడింది.
- అత్యవసర సమయంలో మీ జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలి.
- IMD మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) నుంచి జారీ అయ్యే తాజా సమాచారం తప్పకుండా పాటించండి.

మరోవైపు ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక హైదరాబాద్ లో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచే ముసురు పడుతోంది. కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుండగా… రోడ్లన్నీ జలమయమయ్యాయి.
భారీ వర్షాల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షం దాటికి చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. పత్తి రైతులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.