హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ సమస్యలకు చెక్ పడనుంది.జీహెచ్ఎంసీ తలపెట్టిన మల్టీలెవల్ స్మార్ట్ కారు పార్కింగ్ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది.405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మల్టీలెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ ను సిద్ధం చేశారు. 72 ఈక్వివలెంట్ కారు స్పేసెస్‌తో పాటు పార్కింగ్ విస్తీర్ణంలో 20 శాతాన్ని ద్విచక్ర వాహనాల కోసం కేటాయించారు.
ముఖ్యమైన వివరాలు - ప్రత్యేకతలు :
- హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్‌లో మొట్టమొదటి స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్ నవంబర్ 29, 2025 నుంచి అందుబాటులోకి వస్తుంది.
- ఇందులో 72 కార్లను పార్క్ చేయవచ్చు. అలాగే బైక్‌లను నిలపడానికి ప్రత్యేక స్థలం ఉటుంది.
- హైదరాబాద్ నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్.
- ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చేవారితో పాటు చుట్టుపక్కల వారికి పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
- 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నవ నిర్మాణ్ అసోసియేట్ సంస్థ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించింది.
- ఈ ప్రాజెక్టును నవ నిర్మాణ్ అసోసియేట్స్ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) పీపీపీ మోడల్‌లో నిర్మించి అమలు చేస్తున్నారు.
- ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పార్కు చేసుకునే వీలు ఉంటుంది.
- RFID-ప్రారంభించబడిన స్మార్ట్ ఎంట్రీ ఎగ్జిట్ సౌకర్యం ఉంటుంది.
- ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అందుబాటులో ఉంటాయి.
- సీసీటీవీ, లోడ్ సెన్సార్స్, ఎమర్జెన్సీ సెఫ్టీ సిస్టమ్స్
- సిటీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన KBR పార్క్ చుట్టూ పెరుగుతున్న రోడ్డు పక్కన రద్దీని పరిష్కరించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను పార్క్ చేయడానికి ఈ విధానం సహకరిస్తుంది.

"నగర రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరణ దిశగా తీసుకెళ్తూ, ఈరోజు కేబీఆర్ పార్క్ వద్ద ఆటోమేటెడ్ స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, పార్కింగ్ సౌకర్యాల మెరుగుదల, ప్రజలకు ప్రపంచ స్థాయి సేవలు అందించడంలో ఇది కీలక అడుగు. హైదరాబాద్ అభివృద్ధి – ప్రజల సౌకర్యం మా ప్రభుత్వ ప్రాధాన్యత" అని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.