ఉద్యోగులకు డీఏ ప్రకటన.. జిల్లాలు, మండలాల విభజనకు కమిషన్ : సీఎం కీలక కామెంట్స్
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులను నిరాశ పర్చకుండా డీఏ ఇస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం(డీఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'కొంతమంది అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని బలంగా భావిస్తున్నారు. ఇది తప్పు. మనమందరం ఒకే కుటుంబం, కుటుంబంలో ఎటువంటి కుట్రలు ఉండవు. మీరు, నేను వేరు కాదు.' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

'దేవతలు యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా రాక్షసులు దానిని భంగపరచడానికి ప్రయత్నిస్తారు. ఒక శుక్రాచార్యుడు ఒక ఫామ్‌హౌస్‌లో ఉంటూ మారీచుడు లాంటి వారిని సభకు పంపుతున్నాడు.' అని విమర్శించారు సీఎం.
గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఆదాయం రూ.18,000 కోట్లు కాగా ప్రతి నెలా రూ.22,000 కోట్లు అప్పుగా చెల్లిస్తోందని తెలిపారు. సగటు మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబాన్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్తున్నాడని, ప్రభుత్వం కూడా అదే అనుసరిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపేది ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములని గుర్తు చేశారు.
ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో డీఏ ఫైల్ మీద సంతకం చేశానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు పెంచుతున్న డీఏ కారణంగా రూ.227 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోందన్నారు. అయినా ఉద్యోగుల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
'గతంలో మీ జీతాలు ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడు జీతాలు మీకు ఎప్పుడు జమ అవుతున్నాయో ఆలోచించండి. మీ ఆరోగ్యం, భద్రతను పూర్తిగా నిర్ధారించడానికి మేం చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా అందించడానికి మేం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం. ఇది మా బాధ్యత.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
అందరం కలిసి బాధ్యత తీసుకుంటేనే పరిపాలన నడుస్తుందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని చెప్పారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అనేక అభ్యర్థనలు, డిమాండ్లు వచ్చాయన్నారు. గతంలో వారి ఇష్టాయిష్టాల ప్రకారం విభజించారని ఆరోపించారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ కోసం త్వరలో రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఒక కమిషన్‌ను నియమిస్తామన్నారు. ఈ కమిషన్ రాష్ట్రం అంతటా పర్యటించి జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రజల నుండి సూచనలు, సలహాలను తీసుకుంటుందన్నారు. బడ్జెట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో నియమ నిబంధనలను క్షుణ్ణంగా చర్చిస్తామని వివరించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


