తె

తెలంగాణ రాజకీయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ (బర్తరఫ్) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ బర్తరఫ్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
అనేక పరిణామాల మధ్య కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన గవర్నర్…. వెంటనే ఆమోదం తెలుపుతూ రాజ్‌భవన్ ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు.
గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, తదితర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఒక మంత్రిని బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నుంచి అధికారికంగా జీవో రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ పరిణామంతో ఆమె తక్షణమే తన మంత్రి పదవిని కోల్పోనున్నారు.
ఈ నిర్ణయానికి సంబంధించిన తదుపరి పరిణామాలు, ప్రభుత్వంలో జరగబోయే మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ శాఖలను మరొకరికి కేటాయించడం లేదా ముఖ్యమంత్రి వద్దే ఉంచుకోవడంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.