Telangana Rains : హైదరాబాద్‌లో జోరుగా వర్షం - పూర్తిగా మారిపోయిన వాతావరణం! మరో 2 రోజులు వానలు
Telangana Rains : హైదరాబాద్ వ్యాప్తంగా తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేగంపేట, తిరుమలగిరి, బోయిన్‌పల్లి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Rains : భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామున నగరాన్ని జడివాన ముంచెత్తింది. గడచిన రెండు మూడు గంటలుగా నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఉదయాన్నే ఆఫీసులు, పనులకు వెళ్లే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, మణికొండ, షేక్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్, లక్డీకపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్, హయత్‌నగర్ వంటి దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు :
నగరంలో అత్యధికంగా బేగంపేట ప్రాంతంలో 93 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి….
- బేగంపేట్: 93 మి.మీ
- తిరుమలగిరి: 88 మి.మీ
- బోయిన్‌పల్లి: 84.8 మి.మీ
- మారేడ్‌పల్లి: 70.3 మి.మీ
- అల్వాల్: 68 మి.మీ
- బన్సీలాల్‌పేట్: 66.5 మి.మీ
- కుతుబుల్లాపూర్: 65 మి.మీ
- సికింద్రాబాద్: 63.3 మి.మీ
- బాలానగర్: 60 మి.మీ
- మెట్టుగూడ: 58 మి.మీ
- ఆర్‌సి పురం: 57.8 మి.మీ
- ఖైరతాబాద్: 55.5 మి.మీ
- కూకట్‌పల్లి: 53.3 మి.మీ
- మల్కాజ్‌గిరి: 52.5 మి.మీ
- ముషీరాబాద్: 52.5 మి.మీ
హైదరాబాద్‌లోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మరో గంట నుంచి రెండు గంటల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ పోస్టులో ఉంది. అలాగే దక్షిణ, మధ్య హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపిన వివరాల ప్రకారం…. రాబోయే రెండు మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. చాలా జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
మరోవైపు ఈనెల 20 తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు పడే సూచనలున్నాయని అంచనా.
ఇక శనివారం నుంచి మొదలైన వర్షాలు.. ఆదివారం కూడా కొనసాగాయి. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను వర్షం ముంచెత్తింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.
రెండు మూడు రోజులుగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కేటీకే 2, 3 ఓసీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఓవర్ బర్డన్ తొలగింపునకు వరద నీరు ఆటంకంగా మారడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీకే 2, 3 ఓసీల్లో కలిపి 10 వేల టన్నుల ఉత్పత్తి నిలిచింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

