వాతావరణ మార్పులతో తెలంగాణ పంటలకు కొత్త తెగుళ్ల ముప్పు: పరిష్కారాలివే
తెలంగాణలో మారుతున్న రుతుపవనాల తీరు పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటల్లో కొత్త తెగుళ్లు, వ్యాధుల విజృంభణకు కారణమవుతోంది. వాతావరణ ఆధారిత సమీకృత సస్యరక్షణ వైపు రైతులు ఎలా మళ్లాలో వివరిస్తూ 'పారిజాత్ ఇండస్ట్రీస్' స్ట్రాటజిక్ మార్కెటింగ్ హెడ్ సురేందర్ అగర్వాల్ అందించిన విశేష కథనం.
తెలంగాణ రైతులకు వర్షపాతం పరిమాణమే కాకుండా, వర్షాలు కురిసే సమయం, పొడి వాతావరణం, ఆకస్మిక వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు ప్రధాన సమస్యగా మారాయి. ఈ వాతావరణ వైపరీత్యాలు రాష్ట్రంలో పండే ప్రధాన పంటలైన పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న ఎదుగుదలతో పాటు పురుగులు, తెగుళ్ల ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

పత్తి పంటపై వాతావరణ ప్రభావం
పత్తి పంట ఉష్ణోగ్రతలు, నేల తేమలోని మార్పులకు వేగంగా స్పందిస్తుంది. వర్షాలు ఆలస్యమైతే విత్తనాలు సరిగ్గా మొలకెత్తక, వేరు వ్యవస్థ బలహీనపడుతుంది. నేలలో తేమ తగ్గడం వల్ల మొక్కలు పోషకాలను సరిగ్గా గ్రహించలేవు. అధిక ఉష్ణోగ్రతలకు పొడి వాతావరణం తోడైతే నీటి ఆవిరి శాతం పెరిగి మొక్కలు త్వరగా క్షీణిస్తాయి. ఐసీఏఆర్ (ICAR) పరిశోధనల ప్రకారం.. తరచూ మారే వాతావరణం పత్తి దిగుబడిని దెబ్బతీయడమే కాకుండా రసం పీల్చే పురుగులు, కలుపు మొక్కల తీవ్రతను పెంచుతోంది.
జాసిడ్స్, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగులు వేడి వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. తెల్లదోమ వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తుంది. సుదీర్ఘ పొడి వాతావరణం తర్వాత ఒక్కసారిగా వర్షం పడితే గాలిలో ఆర్ద్రత మారి శిలీంద్ర, బాక్టీరియా వ్యాధులు విజృంభిస్తాయి.
వరి సాగులో మారుతున్న సవాళ్లు
వరి పంటలోనూ వర్షపాతం సమయం ఎంతో కీలకం. ఆరంభంలో వర్షాలు లేకపోతే నార్ల పెంపకం, నాట్లు ఆలస్యమవుతాయి. నీటి కొరత వల్ల బలహీనపడిన వరి పైరు తెగుళ్లను తట్టుకోలేదు. పొలంలో గాలి తేమ, ఉష్ణోగ్రత మారగానే ఒక్కసారిగా తెగుళ్లు దాడి చేస్తాయి. అందువల్ల క్యాలెండర్ ప్రకారం కాకుండా, పొలంలో ఉన్న ప్రత్యక్ష పరిస్థితులను బట్టి నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
మిర్చిలో తెగుళ్ల బెడద
వాణిజ్య పంటైన మిర్చిలో తెగుళ్ల దాడి రైతు ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రతలు, ఆర్ద్రత హెచ్ఛుతగ్గుల వల్ల తామర పురుగులు, నల్లి, పేనుబంక, తెల్లదోమ, కాయ తొలిచే పురుగుల యాజమాన్యం సవాలుగా మారుతోంది. వేడి ఉష్ణోగ్రతలకు తక్కువ ఆర్ద్రత తోడైతే రసం పీల్చే పురుగులు పెరుగుతాయి. అదే సమయంలో వర్షం పడి వాతావరణం వేడిగా, తేమగా మారితే తెగుళ్ల ముప్పు పెరుగుతుంది. కాబట్టి మిర్చి రైతులు పురుగు మందులు పిచికారీ చేయడానికి ముందు పొలాన్ని నిరంతరం పరిశీలించడం అత్యవసరం.
మొక్కజొన్నను ఆశిస్తున్న కత్తెర పురుగు
మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీవార్మ్) ప్రధాన సవాలుగా మారింది. ఉష్ణోగ్రతలు, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరగడం వల్ల కత్తెర పురుగు ప్రవర్తన మారడమే కాకుండా, దానిని సహజంగా నివారించే మిత్ర పురుగుల సంఖ్య తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరంభంలో వర్షాలు లేక మొక్కలు బలహీనపడితే, ఆ తర్వాత వచ్చే వర్షాలు పురుగుల సంతానోత్పత్తికి అనుకూలిస్తాయి.
నేల తేమ, కలుపు మొక్కల సమస్య
వర్షాలు క్రమం తప్పడం వల్ల నేలలో తేమ తగ్గి, వేర్లు పోషకాలను గ్రహించలేవు. పొడి వాతావరణం తర్వాత పడే వర్షాలు కలుపు మొక్కలు ఒకేసారి పెరిగేలా చేస్తాయి. ఇవి ప్రధాన పంటతో నీరు, పోషకాలు, సూర్యరశ్మి కోసం పోటీపడటమే కాకుండా పురుగులు, తెగుళ్లకు ఆశ్రయంగా మారతాయి. కాబట్టి కలుపు యాజమాన్యాన్ని సస్యరక్షణలో భాగంలోనే చూడాలి.
కాలక్రమ సస్యరక్షణ కాదు.. వాతావరణ ఆధారిత నిర్వహణ
పంట దశను బట్టి లేదా నిర్దిష్ట తేదీల ప్రకారం మందులు పిచికారీ చేసే పాత పద్ధతులకు స్వస్తి పలకాలి. వాతావరణం, పంట దశ, పురుగుల తీవ్రత, వ్యాధి లక్షణాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకుల అడుగుభాగం, పిందెలు, పూతను నిరంతరం పరిశీలించాలి. ఫెరమోన్ గొట్టాలు, జిగురు అట్టలను ఉపయోగించాలి.
అవిచక్షణగా పురుగు మందులు వాడితే మిత్ర పురుగులు నశించి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఐసీఏఆర్ నిర్ధారించిన సమీకృత సస్యరక్షణ (ఐపీఎం - IPM) పద్ధతులు వాడటం ద్వారా పత్తి తదితర పంటల్లో పురుగు మందుల వాడకాన్ని తగ్గించి లాభాలను పెంచుకోవచ్చు.
వాతావరణ మార్పుల సమయంలో కేవలం పురుగు మందులు చల్లడం మాత్రమే పరిష్కారం కాదు. నేల తేమకు అనుగుణంగా విత్తడం, విత్తన శుద్ధి, సమతుల్య ఎరువులు, తేమ పరిరక్షణ, చురుకైన కలుపు యాజమాన్యం అవసరం. ముందస్తుగా గమనించి, శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకుని, సరైన సమయంలో స్పందించే రైతే వాతావరణ సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు.
వ్యాసకర్త:
- సురేందర్ అగర్వాల్,
హెడ్ - స్ట్రాటజిక్ మార్కెటింగ్,
పారిజాత్ ఇండస్ట్రీస్

ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


